PM Modi@11 Years: ప్రధానిగా 11 ఏళ్లు పూర్తి..! ఈ 11 ఏళ్ల కాలంలో దేశానికి మోదీ ఏం చేశారు? ఏం సాధించారు?
2014 నుండి ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ఆర్థికంగా బలపడింది, ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. జాతీయ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ పరివర్తన, పేదరిక నిర్మూలన వంటి కార్యక్రమాలను చేపట్టారు. ఆయుష్మాన్ భారత్, జన్ ధన్ యోజన వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేశాయి. మోదీ పాలనలో దేశం అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది.

2014 మే 26.. సాయంత్రం 6 గంటల 13 నిమిషాలకు భారత దేశ ప్రధాన మంత్రిగా తొలిసారి నరేంద్ర మోదీ ప్రమాణాస్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పాలన నిరాంటంకంగా కొనసాగుతోంది. 2014, 2019, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో.. అఖండ విజయాలను నమోదు చేసి.. వరుసగా మూడు సార్లు ప్రధాని పదవిని స్వీకరించారు. అప్రతిహతంగా దూసుకెళ్తున్న మోదీ పాలన నేటితో 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారత దేశ మొట్టమొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రా, ఇందిరా గాంధీ తర్వాత అత్యధిక కాలం ఈ దేశానికి సేవలందించిన ప్రధానిగా నరేంద్ర మోదీ పేరు చిరస్థాయిగా చిలిచిపోనుంది. ఇంత పెద్ద ఘనత సాధించిన ప్రధాని మోదీ.. తన ఈ 11 ఏళ్ల పాలనలో దేశానికి ఏం చేశారు? గతంలో మరే ప్రధాని సాధించలేనిది ఆయన ఏం సాధించారనే విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి.
2014 నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంది. మోదీ క్రియాశీలక నాయకత్వంలో దేశం కొత్త పుంతలు తొక్కింది. తాజాగా.. జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరించింది. యునైటెడ్ స్టేట్స్, చైనా, జర్మనీ తర్వాత అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే అని గర్వంలో ప్రతి భారతీయుడు చెప్పుకోవచ్చు.
బలమైన జాతీయ భద్రతా చర్యల గురించి మాట్లాడుకుంటే.. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్, 2019లో జరిగిన బాలకోట్ వైమానిక దాడి ఆయన నాయకత్వంలో భారత్ బలమేంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. ఇటీవలెఉ పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు భారత్ ఎంత దృఢంగా స్పందించిందో చూశాం. మన దేశ పౌరులపై పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రస్థావరాలను పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లి మరీ కూల్చాం. ఆపరేషన్ సిందూర్‌తో ఈ ప్రపంచానికి భారత సైనిక శక్తి గురించి చాటిచెప్పాం. ఈ సాహసోపేతమైన చర్యలు భారతదేశ ప్రతిష్టను పెంచాయి.
అదే సమయంలో మోడీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ పరివర్తన, వ్యాపార సౌలభ్యానికి అపూర్వమైన ప్రాధాన్యతనిచ్చింది. భారత్‌మాల హైవే నెట్‌వర్క్, స్మార్ట్ సిటీలు, రైలు, వాయు కనెక్టివి వేగవంతమైన విస్తరణ వంటి ప్రాజెక్టులు భారతదేశ స్థాయిని పెంచడంలో దోహదపడ్డాయి. GST, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (PLI) పథకాల అమలు వంటి వ్యూహాత్మక ఆర్థిక సంస్కరణలు భారతదేశాన్ని ప్రపంచ పెట్టుబడులకు ఆకర్షించాయి.
సాంకేతిక ఆవిష్కరణలు, అభివృద్ధి, అంతర్జాతీయ దౌత్యం వంటివి భారతదేశాన్ని ప్రపంచ శక్తి మార్చేందుకు దోహదపడుతున్నాయి. సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్ మంత్రంతో సమ్మిళితమైన, అభివృద్ధి ప్రధానమైన, అవినీతి రహితమైన పాలన ను అందించే దిశగా దేశాన్ని నడిపిస్తున్నారు. మోదీ నాయకత్వంలో భారత్‌లో వేగంగా పేదరిక నిర్మూలన జరుగుతున్నదని ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి. నీతి ఆయోగ్ తాజా నివేదిక ప్రకారం.. గత తొమ్మిదేళ్లలో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారు. పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం చేపడుతున్న ముఖ్యమైన కార్యక్రమాలు ఈ అద్భుత విజయానికి కారణం అయ్యాయి.
ప్రస్తుతం ప్రపంచంలో అతి పెద్దదైన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ నిర్వహణకు భారతదేశం వేదిక అయింది. 50 కోట్ల మంది భారతీయులకు వర్తించే ఈ ఆయుష్మాన్ భారత్ పేదలకు, మధ్యతరగతి ప్రజలకు భరించగల స్థాయిలో నాణ్యమైన వైద్యసేవలను సమకూర్చుతుంది. భారతదేశంలో ఆరోగ్య రంగంపై ప్రజలలో ఉన్న అతి పెద్ద అసంతృప్తిని ఆయుష్మాన్ భారత్ తొలగించిందని ప్రపంచ ప్రతిష్ఠాత్మక ఆరోగ్య జర్నల్‌గా పేరు పొందిన లాన్సెట్ ప్రశంసించింది. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను ప్రాధాన్యతా స్థానంలో నిలపడమే ప్రధాని మోదీ ప్రయత్నం అని ఈ పత్రిక గుర్తించింది.
ఆర్థిక కార్యకలాపాలకు దూరంగా ఉండిపోవడమే పేదలకు పెద్ద శాపం అని గుర్తించిన మోదీ ప్రభుత్వం ప్రతి ఒక్క భారతీయునికి బ్యాంకు ఖాతా అందించే లక్ష్యంతో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ను ప్రారంభించింది. ఇప్పటికి 35 కోట్ల మందికి పైగా జన్ ధన్ ఖాతాలు అందుకున్నారు. ఈ ఖాతాలు బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులో లేని వారికి బ్యాంకులను చేరువ చేయడంతో పాటు సాధికారితకు కూడా తలుపులు తెరిచింది. సమాజంలో నిరాదరణకు గురవుతున్న వర్గాల వారికి బీమా, పింఛను అందించే జన్ సురక్షను కూడా ఆవిష్కరించారు. ఈ ‘జమ్ ట్రినిటీ’ (జన్ ధన్-ఆధార్-మొబైల్) మధ్యదళారీలను నిర్మూలించి, సాంకేతిక విజ్ఞానం ఆధారంగా పారదర్శకత్వాన్ని, వేగాన్ని తీసుకొచ్చింది.
దేశ చరిత్రలో తొలి సారిగా ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన ద్వారా అవ్యవస్థీకృత రంగంలో 42 కోట్ల మందికి పైగా పింఛన్ అందించారు. 2019 ఎన్నికల ఫలితాల అనంతరం మంత్రిమండలి ఒకటో సమావేశంలో వ్యాపారులకు కూడా అదే తరహా పింఛను పథకాన్ని ప్రకటించారు. పేదలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్ లను ఇవ్వడం లక్ష్యంగా 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను ప్రవేశపెట్టారు. 7 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు అందించారు.
స్వాతంత్ర్యం సిద్ధించి 70 సంవత్సరాల సుదీర్ఘ కాలం గడచిన తరువాత కూడా విద్యుత్తు సరఫరా లేని 18,000 గ్రామాల కు విద్యుత్తు సౌకర్యం కల్పించారు. 2014, 2024 మధ్య కాలంలో 4.2 కోట్లకు పైగా ఇళ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కట్టించారు. జూన్ 2024లో మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత క్యాబినెట్ తొలి నిర్ణయాల్లో ఇది ఒకటి. 2019 తాత్కాలిక బడ్జెట్ సందర్భంగా రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే ద్రవ్య ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ప్రధాన మంత్రి మోదీ రెండవ పర్యాయం మొదటి క్యాబినెట్ సమావేశంలో రైతులందరికీ పిఎం కిసాన్ ప్రయోజనాలను వర్తింపజేయాలని నిర్ణయించారు. గతంలో ఉన్న 5 ఎకరాల పరిమితిని తొలగించారు. జూన్ 2024 నాటికి మోదీ వారణాసిలో పిఎం-కిసాన్ పథకం 17వ విడతను విడుదల చేశారు. దీనిలో 9.2 కోట్ల మంది రైతులు రూ.20,000 కోట్లకు పైగా ప్రయోజనాలను పొందారు.
సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వడం, ఇ-నామ్ ద్వారా మెరుగైన మార్కెట్ ల సదుపాయాన్ని కల్పించడం, నీటి పారుదల వసతుల కు పునరుత్తేజం వంటి ఎన్నో వినూత్న పథకాలు మోదీ ప్రభుత్వం చేపట్టింది. నీటి వనరుల కోసం కొత్తగా జల శక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. 2014 అక్టోబరు 2న జాతి పిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛత కోసం “స్వచ్ఛ భారత్” పేరిట ప్రజా ఉద్యమానికి ప్రధాన మంత్రి మోదీ శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమం పరిధిలో గాని, ప్రభావంలో గాని చరిత్ర లోనే అతి పెద్దది. స్వచ్ఛ భారత్ కారణంగా.. నేడు, పారిశుద్ధ్య కవరేజీ 2014లో 38 శాతం నుంచి 2019లో 100 శాతానికి పెరిగింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు బహిరంగ మలవిసర్జన రహితంగా (ఒడిఎఫ్) గుర్తించబడ్డాయి. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసించింది.
ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం ద్వారా విమానయాన రంగం అత్యంత ప్రజామిత్ర విభాగంగా మారింది. సంధానం గణనీయంగా పెరిగింది. భారతదేశాన్ని అంతర్జాతీయ ఉత్పాదక శక్తి కేంద్రంగా మార్చేందుకు ప్రధాని మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతదేశం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో గణనీయమైన పురోగతి సాధించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌ను 2014లో 142 నుండి 2019లో 63కి మెరుగుపరుచుకుంది.
వాతావరణ మార్పులపై పోరాటంలో భాగంగా మోదీ మరో అడుగు ముందుకు వేసి వాతావరణ న్యాయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మరింత మెరుగైన భూమండలం ఆవిష్కారం దిశగా, కొత్త తరహా చర్యలలో భాగంగా 2018 లో ఇంటర్నేషనల్ సోలర్ అలయన్స్ ఏర్పాటు కార్యక్రమంలో పలు దేశాలు, ప్రభుత్వాల అధినేతలు స్వయంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆయన చర్యలకు గుర్తింపుగా ఐక్యరాజ్యసమితి ప్రధానమంత్రి మోదీని “ఛాంపియన్ ఆఫ్ ద అర్థ్” అవార్డుతో గౌరవించింది.
ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం గుజరాత్‌లో సాయంత్రం పని చేసే కోర్టులు ప్రారంభించి ఒక కొత్త శకాన్ని ఆవిష్కరించారు. దేశ వృద్ధిని జాప్యం చేస్తున్న పలు పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రగతి (క్రియాశీల పాలన- సకాలంలో అమలు) కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు.
యావత్తు ప్రపంచం సంవత్సరంలో ఒక రోజును “అంతర్జాతీయ యోగ దినం’’ గా పాటించాలన్న మోదీ పిలుపునకు ఐక్య రాజ్య సమితిలో అద్భుత స్పందన వచ్చింది. ప్రతి సంవత్సరంలో జూన్ 21వ తేదీని “ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ యోగ దినం”గా పాటించాలన్న తీర్మానాన్ని177 సభ్యత్వ దేశాలు ముక్తకంఠంతో ఆమోదించాయి.
విదేశాంగ విధానంలో ప్రధాని మోదీ తీసుకున్న చొరవ వల్ల ప్రపంచం లోని అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా భారత్ పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలు వినియోగంలోకి వచ్చాయి. ఎస్ఎఆర్ఆర్ సి (సార్క్) దేశాధినేతల సమక్షంలో ప్రమాణస్వీకారం చేసి ప్రధాన మంత్రిగా తొలి పర్యాయం పాలనకు మోదీ నాంది పలికారు. రెండో పర్యాయం పదవీకాలం ప్రారంభోత్సవానికి బిఐఎమ్ ఎస్ టిఇసి (బిమ్స్ టెక్) దేశాధినేతలను ఆహ్వానించారు. ఐక్య రాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో ఆయన ప్రసంగానికి ప్రపంచం యావత్తు ప్రశంసల జల్లులు కురిపించింది. సుదీర్ఘ విరామం అనంతరం వివిధ దేశాలలో ద్వైపాక్షిక పర్యటన తొలి భారత ప్రధాన మంత్రిగా ఆయన గుర్తింపు పొందారు. 17 సంవత్సరాల అనంతరం నేపాల్, 28 సంవత్సరాల అనంతరం ఆస్ట్రేలియా, 31 సంవత్సరాల అనంతరం ఫిజీ, 34 సంవత్సరాల అనంతరం సెశెల్స్, యుఎఇ లలో పర్యటించిన మొట్టమొదటి భారత ప్రధాన మంత్రిగా మోదీ నిలిచారు. తొలి సారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే మోదీ.. ఐక్య రాజ్య సమితి, బిఆర్ ఐసిఎస్ (బ్రిక్స్), సార్క్, జి-20 శిఖరాగ్ర సమావేశాల లో పాల్గొన్నారు.
ప్రధాన మంత్రి మోదీకి ఎన్నో అంతర్జాతీయ అత్యున్నత పౌర పురస్కారాలు లభించాయి. సౌదీ అరేబియా ఆయన కు తమ అత్యున్నత పౌర పురస్కారం సాష్ ఆఫ్ కింగ్ అబ్దులజీజ్ తో సత్కరించింది. మోదీకి అత్యున్నత పౌర పురస్కారాలను ప్రదానం చేసిన వివిధ దేశాలలో రష్యా (ద ఆర్డర్ ఆఫ్ హోలీ ఆపాస్సల్ యాండ్రూ ద ఫస్ట్), పాలస్తీనా (గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీన్), అఫ్గానిస్తాన్ (అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డ్), యుఎఇ (జయేద్ మెడల్), మాల్దీవ్స్ (రూల్ ఆఫ్ నిశాన్ ఇజ్జుద్దీన్) లు ఉన్నాయి. శాంతికి, అభివృద్ధికి చేస్తున్న కృషి కి గుర్తింపుగా మోదీ 2018 లో ప్రతిష్ఠాత్మకమైన సియోల్ శాంతి బహుమతిని అందుకొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




