Heeraben Modi passes away: తల్లిపై మోదీకి ఎంత ప్రేమో.. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న ప్రధాని..
Heeraben Modi passes away: తల్లి అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. అమ్మ కొడుకుపై చూపించే ప్రేమ.. కొడుకు తల్లిపై చూపించే ప్రేమను వర్ణించలేము. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తన తల్లి హీరాబెన్ అంటే అమితమైన ప్రేమ. తన పుట్టినరోజు వచ్చిందంటే చాలు.. ఎక్కడ ఉన్నా తల్లి ఆశీర్వాచనాల కోసం..

Heeraben Modi passes away: తల్లి అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. అమ్మ కొడుకుపై చూపించే ప్రేమ.. కొడుకు తల్లిపై చూపించే ప్రేమను వర్ణించలేము. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తన తల్లి హీరాబెన్ అంటే అమితమైన ప్రేమ. తన పుట్టినరోజు వచ్చిందంటే చాలు.. ఎక్కడ ఉన్నా తల్లి ఆశీర్వాచనాల కోసం వెళ్తుంటారు. తల్లి కూడా అంతే ఆప్యాయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని దగ్గరకు చేర్చుకుని ముద్దాడుతున్న ఘటనలు చూశాం. తల్లిని తన దగ్గరకు రావాలని మోదీ పిలిచినా.. సరే సున్నితంగా ఆమె తిరస్కరించారు. తన కొడుకు దేశానికి ప్రధానమంత్రి అనే గర్వం అసలు ఆమెలో కన్పించదు. తన తల్లి ఈ ఏడాది జూన్ లో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ తన బ్లాగ్ లో ఎంతో ఎమోషనల్ అయ్యారు. తన చిన్ననాటి నుండి తల్లితో గడిపిన కొన్ని ప్రత్యేక క్షణాలను గుర్తుచేసుకున్నారు. అతను పెరిగేకొద్దీ తన తల్లి చేసిన అనేక త్యాగాలను తన బ్లాగ్ లో గుర్తుచేసుకున్నారు. తన మనస్సు, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో తన తల్లి యొక్క పాత్రను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
తన తల్లి హీరాబెన్ మోడీ వందో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు.. ఇది ఆమె జన్మ శతాబ్ది సంవత్సరమని ప్రధాని మోదీ తన బ్లాగ్‌లో రాశారు. ధృడత్వానికి ప్రతీకగా ఆమెను ప్రధాని పేర్కొన్నారు. తన చిన్నతనంలో తల్లి ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకున్న ప్రధాని.. తన తల్లి ఎంత సరళంగా ఉంటుందో, ఆమె అసాధారణత గురించి వివరించారు. చిన్న వయసులోనే ప్రధాని మోదీ తల్లి తన తల్లిని కోల్పోయిందని గుర్తు చేశారు. ఆమెకు మా అమ్మమ్మ ముఖం లేదా ఆమె ఒడిలో గడిపిన రోజులు గుర్తు లేవని, ఆమె తన బాల్యాన్ని తన తల్లి లేకుండా గడిపిందని ప్రధాని మోదీ రాసుకొచ్చారు.
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ..
తన తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి వాద్‌నగర్‌లోని మట్టి గోడలతో ఉన్న తన చిన్న ఇంటిని ప్రధాని గుర్తు చేసుకున్నారు. తన తల్లి ఎదుర్కొన్న, విజయవంతంగా అధిగమించిన సమస్యల గురించి ప్రధాని చెప్పుకొచ్చారు. తన తల్లి ఇంటిపనులన్నీ స్వయంగా చేయడమే కాకుండా, కుటుంబాన్ని పోషించడం కోసం కొద్దిపాటి ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఎలా పనిచేస్తుందో తెలిపారు. ఆమె కొన్ని ఇళ్లలో పాత్రలు కడగడంతో పాటు, ఇంటి ఖర్చుల కోసం చరఖాను తిప్పడానికి సమయాన్ని వెచ్చించేదని, వర్షాల సమయంలో మా పైకప్పు లీక్ అయ్యేదని, ఇల్లు జలమయమయ్యేదని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. వర్షపు నీటిని సేకరించేందుకు తల్లి లీకేజీల క్రింద బకెట్లు, పాత్రలను ఉంచేవారని, ఈ ప్రతికూల పరిస్థితుల్లో తన తల్లి దృఢత్వానికి ప్రతీకగా ఉన్నారని ఆనాటి పరిస్థితులను ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు.




పరిశుభ్రత విషయంలో..
పరిశుభ్రత అని ప్రధాని చెప్పుకొస్తూ.. ఈ విషయంలో తన తల్లి ఎప్పుడూ చాలా ప్రత్యేకమైనదని ప్రధాని తెలిపారు. పరిశుభ్రత కోసం పరితపించేవారి పట్ల తన తల్లికి ఎంతో గౌరవం ఉందని ప్రధాని మోదీ అన్నారు. వాద్‌నగర్‌లోని తమ ఇంటి పక్కనే ఉన్న డ్రైన్‌ను శుభ్రం చేయడానికి ఎవరైనా వచ్చినప్పుడు, తన తల్లి వారికి టీ ఇవ్వకుండా వెళ్ళనిచ్చేవారు కాదని, ఇతరుల సంతోషాలలో ఆనందాన్ని కనుగొనడంతో పాటు.. తన తల్లి ఇతరుల ఆనందాన్ని తన ఆనందంగా భావించేవారన్నారు ప్రధాని మోదీ. తన నాన్నగారికి సన్నిహిత మిత్రుడు సమీపంలోని గ్రామంలో ఉండేవారని, అతని అకాల మరణం తర్వాత, మా నాన్న తన స్నేహితుడి కొడుకు అబ్బాస్‌ని తమ ఇంటికి తీసుకువచ్చారని, అబ్బాస్ తమ దగ్గరే ఉంటూ చదువు పూర్తి చేశాడని ప్రధాని మోదీ తన మాతృమూర్తి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన బ్లాగ్ లో వ్యాఖ్యానించారు. ఇలా తన మాతృమూర్తి కష్టాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..