Kashi Vishwanath: వారణాసిలో గత కొన్నేళ్లుగా ఉన్న భూ వివాదానికి తెరపడింది. కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్ కోసం 1700 చదరపు అడుగుల స్థలాన్ని ముస్లిం పెద్దలు కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టుకు అప్పగించారు. దీనికి బదులు కాశీ విశ్వనాథ ఆలయ పరిపాలన ట్రస్ట్ జ్ఞానవాపి మసీదు, కాశీ విశ్వనాథ ఆలయానికి దూరంగా ఉన్న 1000 చదరపు అడుగుల భూమిని ముస్లింలకు ఇచ్చింది. దీంతో కాశీ విశ్వనాథ ఆలయం-జ్ఞానవాపి మసీదు కేసులో భూ వివాదానికి తెరపడింది. దీంతో పవిత్ర పుణ్యక్షేత్రం వారాణసి లో మతసామరస్యం వెల్లి విరిసింది.
ఇదే విషయంపై అంజుమన్ ఇంతజమియా మసీదు సంయుక్త కార్యదర్శి ఎస్.ఎం.వాసిన్ మాట్లాడుతూ.. ఈ భూ వివాదం కేసు ఇప్పటికే కోర్టు లో ఉందని.. ప్రభుత్వం కారిడార్ నిర్మాణం జరుపుతోందని చెప్పారు. అయితే ప్రభుత్వం స్థలం స్వాధీనం చేయాలనీ కోరుతుండడంతో తమ ముస్లిం పెద్దలతో చర్చించామని.. తమ చర్చలు ఫలించి విశ్వనాథుడి ఆలయ కారిడార్ నిర్మాణానికి స్థలం ఇచ్చామని చెప్పారు. తాము చేసిన పని రెండు వర్గాల మధ్య వారధిగా పనిచేస్తుందని, శాంతి, సోదర సందేశాన్ని ఇస్తుందని ఎస్‌ఎం యాస్మిన్ అభిప్రాయపడ్డారు.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలోని మసీదు ప్రాంతంలో సర్వే జరిపేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు వారణాసి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఉత్తర్వులో, ఫాస్ట్ ట్రాక్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి తన ఖర్చుతో పురావస్తు సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన ఐదుగురు సభ్యులు వివాదాస్పద ప్రాంగణాన్ని పరిశీలించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ బృందంలో కనీసం ఇద్దరు సభ్యులు మైనారిటీ వర్గానికి చెందినవారు ఉండాలని కోర్టు నిర్దేశించింది.
ఐదుగురు ఆర్కియాలజికల్ నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను జ్ఞానవాపి మసీదు మేనేజిమెంట్ కమిటీ హైకోర్టులో సవాలు చేసినట్టుగా తెలుస్తోంది. కాశీ విశ్వనాథ ఆలయాన్ని 1664 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కూల్చివేశాడని, అనంతరం 1669లో జ్ఞానవాపి మసీదు నిర్మాణం జరిగిందని ఆలయం తరఫున పిటిషన్ వేసిన విజయ్ శంకర్ రస్తోగి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మసీదు నిర్మించిన స్థలం హిందువులకు చెందినదని తిరిగి హిందువులకు అప్పగించాలని కోరుతున్నారు.
Also Read: Fasting in Hinduism: ఉపవాసం ఏ విధంగా చేయాలి.. దానివలన కలిగే ఆరోగ్య ప్రయోజలు ఏమిటో తెలుసా