
అంతర్జాతీయ మోటార్ బైక్ రేసింగ్ మోటోజీపీ గురించి తెలిసిందే. అయితే ఈ రేసింగ్ తొలిసారిగా భారత్‌లో జరుగుతోంది. శుక్రవారం జరిగినటువంటి ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా మెటోజీపీ ఇండియా మ్యాప్‌ను ప్రదర్శించింది. కానీ ఈ మ్యాప్‌ను ప్రదర్శించిన వీడియోలో భారత పటాన్ని మోటోజీపీ తప్పుగా చూపించింది. దీంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. ఇండియా కేంద్ర పాలిత ప్రాంతాలైనటువంటి జమ్ముకశ్మీర్ అలాగే లద్ధాఖ్‌లను లేకుండా ఆ మ్యాప్‌ను ప్రదర్శించడంపై భారతీయ నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో దీనిపై వెంటనే మోటోజీపీ స్పందించింది. భారత పటాన్ని తప్పుగా చూపించడంపై క్షమాపణలను కోరింది. అయితే ఈ మేరకు మోటోజీపీ తమ అధికారిక ఎక్స్ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. మోటోజీపీ వీడియో ప్రసారంలో ఇండియా మ్యాప్‌ను తప్పుగా చూపించినందుకు భారతీయ అభిమానులకు క్షమాపణలు చెబుతున్నామంటూ తెలిపింది.
ఇండియాకు వ్యతిరేకంగా వ్యవహరించాలనే ఉద్దేశం తమకు లేదని చెప్పింది. అయితే మా మద్దతు ఎప్పుడూ కూడా భారత్‌కు ఉంటుందని పేర్కొంది. అలాగే ఇండియాలోని బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో తొలిసారిగా జరుగుతున్నటువంటి ఇండియన్ ఆయిల్ భారత్ గ్రాండ్ ప్రిక్స్‌ను మీతో కలిసి ఆస్వాదిస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నామంటూ రాసుకొచ్చింది. ఇదిలా ఉండగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఉన్నటువంటి బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో సెప్టెంబరు 22- సెప్టెంబరు 24వ తేది వరకు మూడు రోజులపాటు అక్కడ అంతర్జాతీయ మోటోజీపీ రేసింగ్ జరగనుంది. మరో విషయం ఏంటంటే ఈ రేసింగ్‌లో బైక్ రేసర్లు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో తమ బైక్‌లను నడుపుతారు. మొదటిరోజున సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రాక్టీస్ సెషన్ నిర్వహించనున్నారు.
అలాగే రెండో రోజు ఉదయం 10: 40 AM గంటల నుండి 11:10 AM గంటల వరకు పాక్టీస్ సెషన్ కొనసాగుతుంది. ఆ తర్వాత మొదటి, రెండు క్వాలిఫైయింగ్ రౌండ్లను నిర్వహించనున్నారు. ఇక మూడో రోజు వార్మప్ రేస్, ఫైనల్ రేస్ జరుగనుంది. అయితే ఈ రేసింగ్‌ను జియో సినిమా యాప్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
ఇదిలా ఉండగా.. FIM వరల్డ్ ఛాంపియన్‌షిప్ గ్రాండ్ ప్రిక్స్ దీర్ఘకాల హక్కులను కలిగి ఉన్న డోర్నా స్పోర్ట్స్, ఫెయిర్‌స్ట్రీట్ స్పోర్ట్స్ సహకారం వల్లే ఈ ఈవెంట్ నిర్వహంచడం అనేది సాధ్యమైంది. ఫెయిర్‌స్ట్రీట్ స్పోర్ట్స్ 2023వ సంవత్సరం నుంచి 2029 వరకు ఇండియాలో మోటోజీపీ రేసులను నిర్వహించే హక్కులను కలిగి ఉంది. దీనివల్ల ఇది దేశ మోటార్‌స్పోర్ట్స్ చరిత్రలో కొత్త శకానికి నాందిగా మారడం విశేషం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..