AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ప్రపంచ దేశాల్లో మోదీ హవా.. ఏకంగా 19 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి సరికొత్త రికార్డు..

విదేశీ పర్యటనల్లో ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్నారు. గతంలో దేశాన్ని పాలించిన జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్ వంటి దిగ్గజ ప్రధానుల రికార్డులను బ్రేక్ చేస్తూ.. మోదీ ఏకంగా 19 విదేశీ పార్లమెంట్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పటివరకు 79 దేశాలలో 99 విదేశీ పర్యటనలు చేసిన మోదీ.. అంతర్జాతీయ వేదికలపై భారత్ గళాన్ని ఎలా వినిపించారో తెలుసుకుందాం..

PM Modi: ప్రపంచ దేశాల్లో మోదీ హవా.. ఏకంగా 19 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి సరికొత్త రికార్డు..
Pm Modi Addresses 19 Foreign Parliaments
Krishna S
|

Updated on: Jun 06, 2026 | 12:56 PM

Share

అంతర్జాతీయ వేదికపై భారతదేశ గళం గతంలో ఎన్నడూ లేనంత బలంగా మారిందని చెప్పడానికి ఒక చారిత్రాత్మక రికార్డు సాక్ష్యంగా నిలిచింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014, 2026 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 19 దేశాల పార్లమెంట్లను ఉద్దేశించి ప్రసంగించి అరుదైన ఘనత సాధించారు. భారతదేశ చరిత్రలో మరే ఇతర ప్రధాన మంత్రికి సాధ్యం కాని సరికొత్త రికార్డు ఇది. గతంలో దేశాన్ని పాలించిన ప్రధానుల కంటే మోదీ అత్యధిక విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించారని బీజేపీ అధికారికంగా తెలిపింది. ఇది భారతదేశానికి అంతర్జాతీయంగా పెరుగుతున్న కీర్తికి నిదర్శనమని పార్టీ తెలిపింది. అమెరికా కాంగ్రెస్ ఉమ్మడి సమావేశం నుండి తాజాగా ఇజ్రాయెల్ పార్లమెంట్‌ నెసెట్ వరకు అనేక ప్రతిష్టాత్మక వేదికలపై ప్రధాని మోదీ ప్రసంగించారని బీజేపీ ఎక్స్‌లో వెల్లడించింది.

మనదేశ పాత రికార్డులను ఒకసారి గమనిస్తే.. గత ప్రధానుల కంటే నరేంద్ర మోదీ ప్రసంగాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తన పదవీకాలంలో కేవలం 3 విదేశీ పార్లమెంట్లలో మాత్రమే ప్రసంగించారు. అలాగే ఇందిరా గాంధీ 4 దేశాల్లో, మన్మోహన్ సింగ్ 7 దేశాల్లో ప్రసంగించగా, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి చెరో రెండు విదేశీ పార్లమెంట్లలో మాత్రమే మాట్లాడారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఏకంగా 19 దేశాల పార్లమెంట్లను ఉద్దేశించి ప్రసంగించడం అనేది ప్రపంచ దేశాల మధ్య భారతదేశానికి ఉన్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది.

ప్రధాని మోదీ తన విదేశీ ప్రసంగాల ప్రస్థానాన్ని 2014 లో బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలానికే ప్రారంభించారు. తొలి ఏడాదే ఆయన ఆస్ట్రేలియా, ఫిజీ, నేపాల్, భూటాన్ దేశాల పార్లమెంట్లలో ప్రసంగించారు. ఆ తర్వాత 2015లో మారిషస్, శ్రీలంక, మంగోలియా, బ్రిటన్, ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్లలో కూడా మాట్లాడారు. ఇక 2016 జూన్‌లో ఆయన మొదటిసారిగా అమెరికా కాంగ్రెస్ ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత 2018 లో ఉగాండా, 2019 లో మాల్దీవుల పార్లమెంట్లలో ప్రసంగాలు సాగాయి. 2023 లో ఆయన రెండోసారి అమెరికా కాంగ్రెస్ ఉమ్మడి సమావేశంలో ప్రసంగించి.. భారతదేశం ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు అని ప్రపంచానికి చాటిచెప్పారు. అనంతరం 2024 లో గయానా పార్లమెంట్‌లోనూ, 2025 జూలైలో ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, నమీబియా, ఇథియోపియా పార్లమెంట్లలో సైతం ఆయన చారిత్రాత్మక ప్రసంగాలు చేశారు.

ఇక ఇటీవల ఇజ్రాయెల్ పార్లమెంట్‌ నెసెట్‌లో ప్రధాని మోదీ చేసిన ప్రసంగం అంతర్జాతీయంగా పెద్ద సంచలనంగా మారింది. గతంలో జరిగిన హమాస్ దాడిని తీవ్రంగా ఖండిస్తూ.. ప్రాణాలు కోల్పోయిన ఇజ్రాయెల్ పౌరులకు ఆయన తన ప్రసంగంలో సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రధాని మోదీకి తమ పార్లమెంట్ అత్యున్నత గౌరవాన్ని అందించి సత్కరించింది. అధికారిక లెక్కల ప్రకారం.. ప్రధాని మోదీ ఇప్పటివరకు మొత్తం 79 దేశాలలో 99 విదేశీ పర్యటనలు చేశారు. విదేశీ పార్లమెంట్‌లలో ఆయన చేసిన ఈ 19 ప్రసంగాలు ప్రపంచ శక్తిగాభారత్ ఎదుగుతున్న తీరుకు అద్దం పడుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Follow Us