Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. జూలై 19 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు సమావేశాల తేదీలు ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సాధారణంగా జూలై మూడో వారంలో ప్రారంభమై ఆగస్టు 15వ తేదీ లోపు ముగుస్తుంటాయి. సమావేశాలకు సిద్ధం కావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సహచర మంత్రివర్గ సభ్యులకు సూచించారు. అయితే కరోనా సంక్షోభంపై ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టేవిధంగా సిద్ధమై రావాలని మోదీ సూచిచారు.
కరోనా థర్డ్ వేవ్‌ను అరికట్టేందుకు చేపట్టిన చర్యలు, సదుపాయాలు, వ్యాక్సిన్ డ్రైవ్‌లపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఆయా విభాగాల వారీగా అమలు అవుతున్న కేంద్ర సంక్షేమ పథకాలపై సమగ్ర అవగాహనతో సమావేశాలకు రావాలని సూచించారు. అదేవిధంగా దేశ ఆర్థిక వృద్ధికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా సహచర మంత్రివర్గ సభ్యులను కోరారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.