దేశ వ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. సగంకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అధిక వర్షాలు

దేశంలో సగంకంటే ఎక్కువ రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం బీహార్, హర్యానాలు మినహా మిగతా రాష్ట్రాల్లో ఇప్పటివరకు కురవాల్సిన సగటు వర్షంకన్నా అధిక వర్షపాతం నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు వర్షాలు కొంతమేర తెరిపినిచ్చాయి.

దేశ వ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. సగంకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అధిక వర్షాలు
Weather

Updated on: May 30, 2025 | 10:09 PM

నైరుతి రుతు పవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలు ఇటు దక్షిణాదినే కాక అటు ఉత్తర భారతాన్ని వణికిస్తున్నాయి. తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. అటు ఏపీలో సైతం జూన్ 1వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశమందని తెలిపింది. కేరళ, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో తిరువనంతపురం, పాథానమిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, త్రిస్పూర్, కన్నూర్ కసర్ గోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్, మిగతా ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఎర్నాకులంలో బలమైన గాలులతో కూడిన వర్షంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. జూన్ 3 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. తమిళనాడును సైతం భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. చెన్నై సహా 16 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది వాతావరణ శాఖ. మదురై, విరుద్ నగర్‌ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో నెలకొన్న తుఫాన్ పరిస్థితులు వచ్చే ఐదురోజులపాటు తమిళనాడును ప్రభావితం చేస్తాయని ఐఎండీ వెల్లడించింది.

కర్నాటకలో వర్షాలకు పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. మంగళూరు- సెంట్రల్ షోరనూర్‌ రైల్వే ట్రాక్‌పై భారీ వృక్షం పడిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మంగళూరులో కొండ చరియలు విరిగి పడటంతో ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రలో సైతం వర్షాలు పడుతున్నాయి. మే 24 నుంచి రాష్ట్రంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదయింది. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.

అటు ఉత్తర భారతంలో సైతం జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 24 జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కాన్పూర్‌లో బలమైన గాలులకు పలుచోట్ల హోర్డింగ్‌లు కుప్పకూలాయి. మధ్య ప్రదేశ్‌లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలో వడగండ్లతో భారీ వర్షం ముంచెత్తింది. రోడ్లపై వర్షపు నీరు, బురద చేరడంతో వాహనదారులకు ఇబ్బంది ఏర్పడింది.. ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మిజోరం, మణిపూర్‌, సిక్కిం, రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో కొండచరియ విరిగిపడటంతో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు.. సిక్కింలో తీస్తా నదిలో ఓ టూరిస్ట్ బస్ పడిపోవడంతో ఒక వ్యక్తి చనిపోయాడు. అసోంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గువాహటిలో రోడ్లు నదులను తలపించాయి. పశ్చిమబెంగాల్- బంగ్లా సరిహద్ధుల్లో ఏర్పడిన అల్పపీడనంతో పశ్చిమబెంగాల్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. రాష్ట్రంలో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది ప్రభుత్వం. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.