జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. శనివారం ఉదయం రెండు ఎన్ కౌంటర్లు, గ్రెనేడ్ దాడులతో ఈ రాష్ట్రం ఉలిక్కిపడింది. రంబన్ జిల్లా బాటోట్ లో భారత జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య పెద్దఎత్తున కాల్పులు జరిగాయి. అక్కడ టెర్రరిస్టులు ఓ ఇంటిలో ప్రవేశించి ఓ వ్యక్తిని బందీగా పట్టుకున్నారని, ఆ ఇంట్లో దాక్కుని కాల్పులకు తెగబడ్డారని తెలిసింది. ఆ ప్రాంతం చాలాసేపు కాల్పులతో దద్దరిల్లింది. అటు-జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు ఆపడానికి ప్రయత్నించగా.. భారత జవాన్ల దుస్తుల్లో వఛ్చిన వీరిని చూసి… అనుమానించిన బస్సు డ్రైవర్.. వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్ళిపోయాడు. సమీపంలోని సైనిక చెక్ పోస్టులో సైనికాధికారులకు , పోలీసులకు ఈ సమాచారం అందించాడు. దీంతో జవాన్లు, పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదులకోసం గాలింపు ప్రారంభించారు. టెర్రరిస్టులు ఆ ఇంట్లో ప్రవేశించే ముందు వారిపై బాంబులు కూడా విసిరినట్టు తెలుస్తోంది. మరోవైపు.. నియంత్రణ రేఖ సమీపంలోని గురేజ్ సరిహద్దుల్లో.. గాందర్ బల్ వద్ద జరిగిన ఎన్ కౌంటర్లో ఓ ఉగ్రవాది మరణించాడు. శ్రీనగర్లో కొందరు మిలిటెంట్లు గ్రెనేడ్లు విసిరారని, అయితే ఎవరూ గాయపడలేదని సమాచారం. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు సరిహద్దుల గుండా దేశంలోకి ప్రవేశించవచ్ఛునని వార్తలు వస్తున్న వేళ.. యాంటీ-టెర్రర్ ఆపరేషన్స్ ని ముమ్మరం చేయవలసిందిగా కశ్మీర్ ను విజిట్ చేసిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. రాష్ట్ర పోలీసులను, భారత జవాన్లను ఆదేశించారు.
..