Knife in Chest: కొన్ని కొన్ని ఘటనలు చూస్తుంటే షాకింగ్ అనిపిస్తుంటుంది. అలాంటి షాకింగ్ ఘటనే ఇప్పుడు మరోటి వెలుగులోకి వచ్చింది. ఏడాది కాలంగా ఓ వ్యక్తి ఛాతిలో నాలుగు అంగుళాల కత్తి ఉన్నప్పటికీ అతనికి ఆ విషయం తెలియకపోవడం విశేషం. తాజాగా ఓ ఉద్యోగం కోసం నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతని ఛాతిలో కత్తి ఉందని వైద్యులు తేల్చడంతో అప్పుడు తేలుసుకున్నాడు. వివరాల్లోకెళితే.. ఫిలిప్పీన్స్‌లోని కిడాపావన్ నగరానికి చెందిన కెంట్ ర్యాన్ తోమావో(36) గత ఏడాది జనవరిలో పని ప్రదేశం నుంచి ఇంటికి వస్తుండగా.. కొందరు వ్యక్తులు అతనిపై కత్తితో దాడి చేశారు. ఆ సమయంలో వైద్యులు అతని శస్త్ర చికిత్స చేశారు. అయితే శరీరంలో గుచ్చుకున్న కత్తిని బయటకి తీయకుండా వైద్యులు అలాగే కుట్లు వేశారు. అయితే అంతా సెట్ అయ్యిందనుకున్నాడు కెంట్. కానీ, తాజాగా అసలు విషయం తెలియడంతో ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
గత సంవత్సరం తనకు చికిత్స చేసిన వైద్యులు తన గాయానికి ట్రీట్‌మెంట్ ఇచ్చారని, ఆ సమయంలో తన శరీరంలో కత్తిని వైద్యులు వదిలేశారని కెంట్ చెప్పుకొచ్చాడు. అయితే, శరీరంలో కత్తి పెట్టుకుని పని చేయడం కుదరదు అంటూ తాజాగా అతన్ని పనిలోకి తీసుకున్న యాజమాన్యం కెంట్‌కి తేల్చి చెప్పింది. దీంతో కెంట్ దిక్కుతోచని స్థితిలోపడిపోయాడు. తాను కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించాలంటే వైద్యులు తన శరీరంలో ఉన్న కత్తిని తొలగించాలని కోరాడు. వైద్యులు గత సంవత్సరం తన గాయాలను సరిగ్గా తనిఖీ చేయలేదని, వారు చేసిన తప్పుని వారే పరిస్కరించాలని వేడుకున్నాడు. చల్లటి వాతావరణంలో ఉన్నప్పుడు ఛాతి బాగంలో ఇబ్బందిగా అనిపించేదని, అయితే దాన్ని తాను పెద్దగా పట్టించుకోలేదని కెంట్ చెప్పుకొచ్చాడు.
ఇదిలాఉంటే కెంట్ ఛాతిలో ఉన్న కత్తిని తొలగించడానికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అయితే దానికి భారీగా డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. కానీ అతని వద్ద మాత్రం డబ్బులు లేవు. ‘నేను ఈ కత్తిని తీసే వరకు పనిని చేయలేను. అలాగని ఉద్యోగం లేకుండా నా వైద్య అవసరాలను తీర్చుకోవడానికి నా వద్ద డబ్బు కూడా లేదు’ అని బాధితుడు కెంట్ వాపోయాడు. తాను ఆరోపణలు చేయడం లేదని, తన శరీరంలో ఉన్న కత్తిని బయటకు తీయాలని మాత్రమే కోరుకుంటున్నాని సదరు వైద్యులను కెంట్ వేడుకున్నాడు. కత్తిని తీసేస్తే గానీ.. తనకు ఉద్యోగం రాదని ఆవేదన వ్యక్తం చేశాడు.
Also read: