Mamata Banerjee Discharged: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బుధవారం దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆమె కాలికి గాయం కావడంతో ఆసుపత్రిలో చేరారు. తాజాగా మమతా బెనర్జీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం సాయంత్రం మమతాను వైద్యులు కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేహెచ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అనంతరం ఆమె వీల్ చైర్‌లో ఇంటికి వెళ్లారు. మూడు రోజుల చికిత్స అనంతరం ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. వాస్తవానికి మమతకు మరింత చికిత్స అవసరం ఉన్నప్పటికీ.. తనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలని ఆమె పదే పదే కోరారని.. ఆమె అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే వారం రోజుల తర్వాత మరోసారి పరీక్షలకు ఆసుపత్రికి రావాల్సి ఉందని.. అప్పటివరకు మమతా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని ఎస్ఎస్‌కేహెచ్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆమె కోలుకున్నారని తెలిపారు.
కాగా.. నందిగ్రామ్‌లో నామినేషన్ వేసిన సీఎం మమతా బెనర్జీ తనపై దాడి జరిగిందని మీడియాకు వెల్లడించారు. కారు వద్ద కొందరు తనను నెట్టివేయడంతో తన కాలికి తీవ్ర గాయమైందని పేర్కొన్నారు. ఆ సమయంలో పోలీసులు లేరని, దాడి వెనుక కుట్ర ఉందటూ ఆమె ఆరోపించారు. కాగా.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రజల సానుభూతి కోసం మమత దాడి ఆరోపణలు చేశారని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు గుప్పించాయి. దీనిపై సమగ్రంగా విచారణ జరిపించాలని ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఇప్పటికే ఈ విషయంపై టీఎంసీతోపాటు ప్రతిపక్షాల ప్రతినిధులు ఈసీకి ఫిర్యాదు చేశారు. కాగా.. ఈ సంఘటనపై ఎన్నికల సంఘం బెంగాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితోపాటు రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు నివేదిక అందించాలని కోరింది.
Also Read: