Tamil Nadu Election: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మూడో కూటమి ఏర్పాటుకై తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న మక్కల్ నీదిమయ్యం అధినేత కమల్ హాసన్ తాజాగా కీల ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీని కమల్ హసన్ ఆహ్వానించారు. మూడో కూటమిలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రకటన తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఎన్నికల సమీపిస్తున్నా కొద్ది కమల్ వ్యూహ ప్రతివ్యూహాలు ముందుకు దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీని ఆయన ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్-డీఎంకే పార్టీలు మిత్రపక్షాలుగా ఉంటూ వచ్చాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇరు మధ్య సీట్ల కేటాయింపుపై అవగాహన కుదరలేదు.
తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ పార్టీ తమకు 40 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. అయితే, డీఎంకే మాత్రం అందుకు ససేమిరా అంటోంది. కేవలం 22 స్థానాలు మాత్రమే ఇస్తామని తేల్చి చెప్పింది. దాంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ను తమవైపు లాక్కోవాలని భావించిన కమల్ హాసన్.. ఆ పార్టీకి భారీ ఆఫర్ ఇచ్చారు. అడిగినన్ని స్థానాలు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కమల్ హాసన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ని అణగదొక్కుతోంది బీజేపీ కాదని, డీఎంకే నే అని మక్కల్ నీదిమయ్యం నేతలు అంటున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు అర్థం చేసుకుని మూడో కూటమితో కలిసి రావాలని కోరుతున్నారు.
ఇదిలాఉంటే.. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు సింగిల్ ఫేజ్‌లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఈసీ షెడ్యూల్ ప్రకారం.. తమిళనాడులో ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 12వ తేదీన వెలువడనుంది. నామినేషన్ల దాఖలు చివరి తేదీ మార్చి 19గా పేర్కొన్నారు. ఇక మార్చి 20 వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 22వ తేదీ వరకు గడువు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. మే 2న ఫలితాలు ప్రకటించనున్నారు.
Also read:
పాకిస్తాన్ పార్లమెంట్ లో విశ్వాస పరీక్ష, 178 ఓట్లతో నెగ్గిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్