Maharashtra Man Dies: దేశంలో ఓ వైపు కరోనావైరస్ మహమ్మారి కేసులు నానాటికీ పెరుగుతున్నాయి.. మరో వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో పలు నగరాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ర్టాల ప్రభుత్వాలు సైతం అప్రమత్తవుతున్నాయి. మహారాష్ట్రలో పలుచోట్ల లాక్‌డౌన్ కూడా విధించారు. అయితే కరోనా కట్టడికి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే అపోహాలు కూడా తొలిగిపోతున్నాయి. ఈ తరుణంలో మహారాష్ట్రలో వ్యాక్సిన్ రెండవ డోసు తీసుకొన్న కొద్ది సేపటికే ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం దేశంలో తీవ్ర కలకలం రేపింది. థానే జిల్లా భివాండిలోని ఆసుపత్రిలో కోవిడ్-19 వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న కొద్దిసేపటికే 45 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
థానేలోని ఓ వైద్యుడి డ్రైవర్‌గా పనిచేస్తున్న సుఖ్‌దియో కిర్దిట్ మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నాడు. ఆతర్వాత కొద్దిసేపటికే కళ్లు తిరుగుతున్నట్టు ఫిర్యాదు చేశాడు. వెంటనే అతను మూర్ఛపోగా.. కిర్దిట్‌ను సమీపంలోని ఇందిరా గాంధీ మెడికల్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు తెలిపారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత కిర్దిట్ మరణానికి కారణం తెలుస్తుందని భివాండి నిజాంపురా మునిసిపల్ కార్పొరేషన్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కేఆర్ ఖరత్ తెలిపారు. కిర్డిట్ మెడికల్ హిస్టరీ, ఇతర రికార్డులను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
కాగా సుఖ్‌దియో కిర్దిట్ జనవరి 28న కరోనా టీకా మొదటి డోస్ తీసుకున్నాడని.. అప్పుడు అతనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని ఖరత్ తెలిపారు. బీపీ, శ్వాస ప్రక్రియ సజావుగానే ఉందని పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ రెండో విడత ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి విడతలో ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వగా.. రెండో విడతలో 60ఏళ్లు పైబడిన వారికి.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకునే వారు కోవిన్ యాప్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: