Maharashtra weekend lockdown: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ వికృతరూపం ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఈసారి భారతదేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయం పెరగుతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అయా రాష్ట్రాలకు కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలో పాక్షిక లాక్ డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. ఉదయం సమయంలో సెక్షన్ 144, రాత్రిపూట కర్ఫ్యూతోపాటు వీకెండ్‌లో అంటే శని, ఆదివారారాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర సేవలను ఈ ఆంక్షల నుంచి మినహాయించారు. ఆంక్షలు సోమవారం ఉదయం నుంచే అమల్లోకి వస్తాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్తగా విడుదల చేసిన ఆంక్షలు ఏప్రిల్ 30వ తేదీ వరకు కొనసాగుతాయని పేర్కొంది మహారాష్ట్ర ప్రభుత్వం.
కరోనా కేసులు పెరగుతుండటంతో పాక్షిక లాక్‌డౌన్ నిర్ణయాన్ని ప్రతిపక్ష నాయకులు స్వాగతించారు. ప్రజలందరూ సహకరించాలని ప్రతిపక్ష నేతలు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఈ నియమాలను అమలు చేసేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తుందని దీంతో లాక్‌డౌన్ పరిస్థితులు ఏర్పడ్డాయని ఈ విషయంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి అనేక మంది నిపుణులు, పారిశ్రామిక వేత్తలు, పత్రిక యాజమాన్యం, సంపాదకులతోపాటు అన్ని రంగాల ప్రతినిధులతోపాటు వివిధ పార్టీల నేతలతోనూ విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు. ఇలా అందరితో అభిప్రాయాల మేరకు ఆదివారం రాష్ట్ర కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంది.
పాక్షిక లాక్‌డౌన్ అమలు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇదిలావుంటే, ఆదివారం ఒక్కరోజే 57 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మినీలాక్ డౌన్‌లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో పనిచేయాలి. ప్రైవేట్ ఉద్యోగులు ఇంటి నుంచి (వర్క్ ఫ్రం హోం) పనులు చేయాలి. హోటళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, ధార్మిక, దర్శనీయ స్థలాలు, మైదానాలు, జిమ్‌లు, సెలూన్లు మూసి వేయనున్నారు. హోటళ్లు పార్సిల్ సేవలు కొనసాగించవచ్చు. రైళ్లు, విమాన సేవలు యథావిధిగా కొనసాగుతాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది..
Read Also.. సెలూన్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్.. సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ.. ఏప్రిల్ 1 నుంచి అమలు..