మహారాష్ట్రలో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న ట్రక్ డ్రైవర్ తన వాహనాన్ని హోటల్ భవనాన్ని ఢీకొట్టాడు. అక్కడున్న వాహనాలపైకి దూసుకెళ్ళాడు. హోటల్‌లో భోజనం పెట్టేందుకు సిబ్బంది నిరాకరించడంతో ట్రక్కుతో ఢీకొట్టాడు డ్రైవర్. ఈ ఘటనలో పార్క్ చేసిన అనేక కార్లు, బైక్‌లు ధ్వంసం అయ్యాయి.
పూణే జిల్లాలోని ఇంద్రాపూర్‌లో శుక్రవారం రాత్రి పూణె-సోలాపూర్ హైవేపై హింగాన్‌గావ్‌లోని ఒక హోటల్‌లో ఈ ఘటన జరిగింది. తనకు ఫుడ్ అందించడానికి నిరాకరించడంతో మద్యం మత్తులో డ్రైవర్ కోపానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ట్రక్కు డ్రైవర్‌కు ఆహారం ఇవ్వడానికి హోటల్ సిబ్బంది నిరాకరించింది. దీంతో హోటల్ సిబ్బందితో పాటు అక్కడున్న కస్టమర్లకు ట్రక్ డ్రైవర్ చుక్కలు చూపించాడు. భోజనం పెట్టేందుకు నిరాకరించడంతో ఆగ్రహం చెందిన ట్రక్ డ్రైవర్ హోటల్ ముందు ఆగి ఉన్న వాహనాలన్నింటినీ ఢీకొట్టి ప్రతీకారం తీర్చుకున్నాడు. చివరికి డ్రైవర్ కూడా లారీతో హోటల్ ప్రధాన గేటును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో హోటల్ బయట పార్క్ చేసిన ఇతర కస్టమర్ల ద్విచక్ర వాహనాలు, కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇందుకు సంబంధించి గగుర్పాటు కలిగించే వీడియో బయటపడింది.
ఇందాపూర్ తహసీల్ ప్రాంతంలో ట్రక్ డ్రైవర్ హైవే పక్కన ఉన్న గోకుల్ రెస్టారెంట్‌కు భోజనం చేయడానికి వచ్చాడు. ట్రక్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో హోటల్ మేనేజర్ అతనికి ఆహారం అందించడానికి నిరాకరించాడు. దీంతో ఆ ట్రక్ డ్రైవర్ కోపంతో తన ట్రక్కులో వెళ్లిపోయాడు. ఆ తర్వాత, అతను ట్రక్కును స్టార్ట్ చేసి, అతి వేగంతో హోటల్‌ను ఢీకొట్టాడు. హోటల్ వెలుపల చాలాసేపు తన ట్రక్కుతో చక్కర్లు కొట్టాడు. అంతే కాదు ఆగ్రహించిన ట్రక్ డ్రైవర్ హోటల్ బయట పార్క్ చేసిన కస్టమర్ల కార్లను డీకొట్టాడు. ఈ సమయంలో లారీ డ్రైవర్ పలు వాహనాలను ధ్వంసం చేశాడు.
హఠాత్తుగా జరిగిన ఈ ఘటనలో హోటల్‌కు వచ్చిన కస్టమర్లు, హోటల్ సిబ్బంది ఏం జరుగుతుందో అర్థం కాక షాక్ అయ్యారు. ఈ సమయంలో కొందరు వ్యక్తులు లారీపై రాళ్లు రువ్వి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంత గొడవ జరిగిన తర్వాత మద్యం మత్తులో ఉన్న ట్రక్కు డ్రైవర్ హోటల్ సిబ్బందిపై దుర్భాషలాడాడు. ఈ మొత్తం ఘటనతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..