షాకింగ్ తీర్పులకు కోర్టులు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి. బాధితులకు న్యాయం జరగాలనే ఏకైక లక్ష్యంతో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. లైంగిక వేధింపులు, భార్యాభర్తల సంబంధాలు, కుటుంబసమస్యలు వంటి కేసుల్లో అసమాన తీర్పులు వెల్లడిస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా మద్రాస్ కోర్టు సైతం ఇదే రకమైన తీర్పునిచ్చింది. అమెరికాలో ఉంటున్న వ్యక్తికి, ఇండియాలో ఉంటున్న యువతి పెళ్లికి అనుమతించింది. ఇందులో విషేషమేంటంటే.. వరుడు అమెరికాలో (America) ఉన్నందున వధువే రిజిస్టర్ లో రెండు సంతకాలు చేయాలని సూచించింది. అంతే కాకుండా ఆ పెళ్లిని చట్టపరంగా పరిగణించాలని ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడులోని (Tamil Nadu) కన్యాకుమారి జిల్లా మణవాళకురిచ్చి ప్రాంతానికి చెందిన వంశీ సుదర్శిని, రాహుల్ ప్రేమించుకున్నారు. రాహుల్ అమెరికాకు వెళ్లగా సుదర్శిని ఇండియాలోనే ఉంది. ఈ క్రమంలో కొంత కాలానికి రాహుల్ ఇండియా వచ్చాడు. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అయితే వీరి వివాహానికి మణవాళకురిచ్చి రిజిస్ఱ్రార్ నిరాకరించారు. దీంతో కంగుతిన్న యువతీయువకులు తమ పెళ్లిని నిరాకరించడానికి కారణం చెప్పాలని కోరారు. రిజిస్ట్రార్ ఆఫీసర్ సరైన కారణం చెప్పకపోవడం, అప్పటికే రాహుల్ వీసా గడువు ముగియడంతో అమెరికా వెళ్లిపోయాడు.
ఈ క్రమంలో తామిద్దరూ వీడియో కాన్ఫరెన్సులో పెళ్లి చేసుకునేందుకు అనుమతివ్వాలని సుదర్శిని మద్రాస్ కోర్టు మెట్లెక్కింది. అంతే కాకుండా తమ వివాహాన్ని చట్టబద్ధం చేయాలని పిటిషన్ వేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్.. యువతీ యువకులు పెళ్లి చేసుకునేందుకు చట్టపరమైన అడ్డంకులేవీ లేవని తెలిపారు. వివాహ రిజిస్టర్ లో వధూవరుల సంతకాలు రెండూ వధువే చేయవచ్చని తీర్పు వెల్లడించింది. తద్వారా ఆ వివాహాన్ని చట్ట ప్రకారం నమోదు చేయాలని సంబంధిత రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..