చెన్నై, జులై 23: మంచి నీళ్లనుకుని యాసిడ్ తాగిందో మహిళా కార్మికురాలు. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో, రింగు థాకరే అనే మహిళా కార్మికురాలు బాటిళ్లను క్లీన్ చేసే ఫ్యాక్టరీలో పని చేస్తుంది. అక్కడ వాడేసిన మద్యం బాటిళ్లను యాసిడ్‌తో శుభ్రం చేసి మద్యం కంపెనీలకు విక్రయిస్తుంటారు. బుధవారం నాడు పని చేస్తున్న సమయంలో రింగు థాకరేకు దాహం వేయడంతో నీళ్ల కోసం కార్మికురాలిని అడిగింది.
ఆమె చూసుకోకుండా నీళ్ల బాటిల్ అనుకుని యాసిడ్ బాటిల్ అందించింది. అవి మంచి నీళ్లు అనుకుని సదరు మహిళ తాగేసింది. దీంతో ఒక్కసారిగా నోరంతా మండటంతో బాధిత మహిళ అరవడం ప్రారంభించింది. ఫ్యాక్టరీ సూపర్‌వైజర్, తోటి కార్మికులు ఆమెను హుటాహుటీన బర్వాహా సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం ప్రమాదకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఖర్గోన్ పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.