Wedding card:ముస్లిం పెళ్లి శుభలేఖపై రాధాకృష్ణులు, గణేషుడి ఫోటో, వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డు
మన దేశంలో హిందూ.. ముస్లింలు ఎంతో సఖ్యతగా కలిసి ఉంటారు. ముస్లింలు ఎంతో గొప్పగా జరుపుకునే ఉర్సు ఉత్సవాలకు హిందువులు వెళ్లి మొక్కుబడులు చెల్లించుకుంటారు.
మన దేశంలో హిందూ.. ముస్లింలు ఎంతో సఖ్యతగా కలిసి ఉంటారు. ముస్లింలు ఎంతో గొప్పగా జరుపుకునే ఉర్సు ఉత్సవాలకు హిందువులు వెళ్లి మొక్కుబడులు చెల్లించుకుంటారు. హిందువులు జరుపుకునే పలు పండగలు, శుభకార్యాల్లో ముస్లింలు సంతోషంగా పాలుపంచుకుంటారు..ఈ క్రమంలోనే మత సామరస్యానికి ప్రతీకగా ఓ ముస్లిం యువకుడు చేసిన పనికి అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. ముస్లింల పెళ్లి శుభలేఖలపై తెలుగు దేవుళ్ల బొమ్మలు ముద్రించిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో ఓ ముస్లిం యువకుడి పెళ్లి కార్డు (Wedding card)సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాస్తవానికి విదిషాలోని ఆనంద్‌పూర్‌లో నివాసముంటున్న దివంగత రుస్తమ్‌ఖాన్ కుమారులు ఇర్షాద్, అన్సార్‌ల వివాహం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో పెళ్లి కార్డుల ద్వారా కుటుంబ సమేతంగా ఐక్యతా సందేశాన్ని అందించారు. అన్సార్, ఇర్షాద్‌లు వివాహ ఆహ్వాన పత్రంతో పాటు ఆహ్వానపత్రికపై హిందూ ఆరాధ్య దైవమైన గణేశుడి చిత్రాన్ని, అలాగే ఆహ్వానపత్రిక లోపల శ్రీకృష్ణుడు, రాధ కలిసివున్న చిత్రాన్ని ముద్రించారు. ముస్లిం యువకుడి పెళ్లిలో హిందూ దేవుళ్ల చిత్రాలను ముద్రించడంతో.. ఈ పెళ్లి కార్డులు ఆ ప్రాంతమంతా చర్చనీయాంశంగా మారాయి. ఇది కాస్త ఇంటర్‌నెట్‌లో చేరటంతో సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతోంది.
22 మే 2022న జరగనున్న ఈ వివాహ కార్డులు హిందీ భాషలో ముద్రించబడ్డాయి. ఆహ్వాన పత్రికలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె వంటి పదాలు వాడారు. ఆనంద్‌పూర్‌లో ఇర్షాద్, అన్సార్‌ఖాన్‌ల వెడ్డింగ్ కార్డ్ బయటకు వచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ముస్లిం కుటుంబాలు తమ పెళ్లి కార్డులను ఉర్దూ లేదంటే ఇంగ్లీషు భాషలో ప్రింట్ చేస్తారు, అలాగే ఎరుపు రంగులో కార్డును ప్రింట్ చేయకుండా ఉంటారు. కానీ ఇర్షాద్, అన్సార్ తమ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డును తమ సంప్రదాయాన్ని విస్మరించి ప్రత్యేకమైన రీతిలో ముద్రించడం ద్వారా గంగా జమునా తహజీబ్‌కు ఉదాహరణగా నిలిచారు.
ఆహ్వానపత్రికల ద్వారా యువత ఐక్యతా సందేశాన్ని అందించారు. పెళ్లి అనేది ఏడు జన్మల బంధం, దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ వివిధ మార్గాలను అవలంబిస్తారు, కానీ విదిశలో యువత సోదరభావానికి ఉదాహరణగా ఇటువంటి ప్రత్యేకమైన చిత్రాన్ని అందించారు.