12 ఏళ్లుగా ఇంట్లోనే ఉన్నాడు.. అయినా ఆ కానిస్టేబుల్‌కు రూ. 28 లక్షల జీతం!

మధ్యప్రదేశ్‌లో ఓ కానిస్టేబుల్‌ 12 ఏళ్లుగా ఉద్యోగం చేయకుండా ₹28 లక్షలు జీతం తీసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. 2011లో నియామకం పొందిన సాగర్‌ అనే వ్యక్తి శిక్షణ తర్వాత విధుల్లో చేరలేదు. అయినప్పటికీ, అతని జీతం క్రమం తప్పకుండా చెల్లించబడింది. బదిలీల సమయంలో ఈ అక్రమం బయటపడింది. ప్రస్తుతం అతని నుండి ₹1.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

12 ఏళ్లుగా ఇంట్లోనే ఉన్నాడు.. అయినా ఆ కానిస్టేబుల్‌కు రూ. 28 లక్షల జీతం!
Mp Police

Updated on: Jul 06, 2025 | 10:47 PM

ఓ కానిస్టేబుల్‌ 12 ఏళ్ల పాటు ఉద్యోగం చేయకుండా రూ.28లక్షలు తీసుకున్న ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. వివరాళ్లోకి వెలితే.. విదిష జిల్లాకు చెందిన సాగర్‌ అనే వ్యక్తి 2011లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. దీంతో అతనికి భోపాల్ పోలీస్ లైన్‌లో పోస్టింగ్ వచ్చింది. ఇక పోస్టింగ్ వచ్చిన తర్వాత సాగర్ ట్రైనింగ్‌కు వెళ్లాడు. అయితే సాగర్ ట్రైనింగ్‌కు వెళ్లకుండా తిరిగి విదిషలోని తన ఇంటికి వచ్చాడు. తాను ఇంటికి వెళ్తున్నట్టు ఏ అధికారికి సమాచారం ఇవ్వలేదు. తాను సెలవు కోసం దరఖాస్తు కూడా పెట్టుకోలేదు. అయితే తను ఇంటికి వెళ్లిపోయాక.. తన సర్వీస్ ఫైల్‌ను మాత్రం స్పీడ్ పోస్ట్ ద్వారా భోపాల్‌కు పోలీస్ స్టేషన్‌ను పంపాడు. ఆ ఫైల్ అక్కడికి చేరుకోగానే.. ఎటువంటి వెరిఫికేషన్ లేకుండానే ఆమోదముద్ర పొందింది. భోపాల్ పోలీస్ లైన్‌లోని అధికారులు కూడా ఎవరూ అతని విధులకు హాజరవుతున్నాడా, లేదా అని పట్టించుకోలేదు. దీంతో విధులకు హాజరుకాకుండానే సాగర్‌ ప్రతినెల జీతం పొందుతూనే ఉన్నాడు. ఇలానే సుమారు 12 సంవత్సరాలుగా పాటు సాగర్‌ సుమారు రూ. 28లక్షల జీతాన్ని పొందాడు. అప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా ఈ అక్రమాన్ని గుర్తించలేకపోయారు.

అయితే ఒకే పోలీస్ స్టేషన్లలో చాలా కాలంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులను బదిలీ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ కావడంతో స్టేషన్‌లోని ప్రతి పోలీసు వివరాలను డిజిటలైజ్ చేయాలని డీజీపీ అధికారులను ఆదేశాలు జారీ చేశారు. దీంతో సాగర్‌ ఉదాంతం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆ కానిస్టేబుల్‌ని పిలిపించి ఆరా తీశారు. తాను మానసిక, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నందునా ఇన్నాళ్లు విధులకు హాజరుకాలేదని కానిస్టేబుల్‌ చెప్పుకొచ్చాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసు దర్యాప్తును టీట నగర్ ప్రాంతంలో పనిచేస్తున్న ఏసీపీ అంకిత ఖతార్కర్‌కు అప్పగించారు.

ఇక కేసు దర్యాప్తులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. సాగర్‌ ఒంటరిగా శిక్షణకు వెళ్లడానికి అనుమతి తీసుకున్నాడని.. కానీ అతను ట్రైనింగ్‌కు రాలేదని ఆమె తెలిపింది. ట్రైనింగ్‌ సెంటర్‌లో అతని హాజరు కూడా నమోదు కాలేదని తెలిపింది. ప్రస్తుతం ఆ కానిస్టేబుల్‌ నుంచి రూ. 1.5 లక్షలు స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన డబ్బును అతని రాబోయే జీతం నుంచి తీసుకుంటామని ఏసీపీ చెప్పుకొచ్చింది. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో నిర్లక్ష్యంగా వ్వవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.