Ordinance Factory: జబల్‌పూర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. కుప్పకూలిన భవనం..!
భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోె నిర్వహిస్తున్న జబల్పూర్ అర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రాంతంలోని ఎఫ్6 విభాగంలో ఏరియల్ బాంబు పేలింది. పేలుడు ధాటికి ఓ ఫ్యాక్టరీ భవనం కుప్పకూలింది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని ఖమారియాలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మంగళవారం(అక్టోబర్ 22) భారీ ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలంలో ఫ్యాక్టరీ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఫ్యాక్టరీ ప్రాంతంలోని ఎఫ్6 విభాగంలో ఏరియల్ బాంబు పేలింది. పేలుడు ధాటికి ఓ ఫ్యాక్టరీ భవనం కుప్పకూలింది. జబల్పూర్ నెలకొల్పిన ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ ఫ్యాక్టరీలో సైన్యం కోసం ఆయుధాలు, బాంబులు తయారు చేస్తారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పేలుడు శబ్ధం కొన్ని కిలోమీటర్ల మేర వినిపించింది. ఈ ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు.
ఈ ప్రమాదంలో గాయపడిన 11 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఉద్యోగుల నుంచి అందుతున్న సమాచారం. భవనం దెబ్బతినడం వల్ల శిథిలాల కింద చిక్కుకున్న ఒక ఉద్యోగి ఇప్పటికీ కనిపించలేదు. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమారియా సీనియర్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని, సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఫ్యాక్టరీ చీఫ్ జనరల్ మేనేజర్ మన్వేంద్ర హల్దార్, ఎంపీ ఆశిష్ దూబే, కాంట్ ఏరియా ఎమ్మెల్యే అశోక్ రోహని కూడా క్షతగాత్రులను చూసేందుకు ఆస్పత్రికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని సూచించారు. ప్రమాదంపై విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చీఫ్ జనరల్ మేనేజర్ మన్వేంద్ర హల్దార్ తెలిపారు. నిపుణుల బృందం మొత్తం కేసును పరిశీలిస్తుంది. పేలుడు జరిగిన ప్రదేశంలో పటిష్ట భద్రత ఉందని అధికారులు తెలిపారు. బయటి వ్యక్తుల ప్రవేశంపై నిషేధం ఉంది. ఈ ప్రమాదంలో ఎంత నష్టం జరిగిందనేది ఇంకా అంచనా వేయలేదు. ప్రమాదం గురించిన సమాచారాన్ని క్షతగాత్రుల బంధువులకు పంపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..