Lok Sabha Polls: లోక్‌‌సభ ఎన్నికల బరిలో కేంద్ర మంత్రులు నిర్మల, జైశంకర్.. ఆ రాష్ట్రం నుంచి పోటీ..?

2024 General Elections: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు కర్ణాటకలో పార్టీ శ్రేణులను బీజేపీ అధిష్టానం సన్నద్ధం చేస్తోంది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తును ఇప్పటికే మొదలుపెట్టింది. ఇద్దరు, ముగ్గురు కేంద్ర మంత్రులకు కర్ణాటక నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిపే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బెంగుళూరులో బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు జరిగిన లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో..

Lok Sabha Polls: లోక్‌‌సభ ఎన్నికల బరిలో కేంద్ర మంత్రులు నిర్మల, జైశంకర్.. ఆ రాష్ట్రం నుంచి పోటీ..?
Nirmala Sitharaman, Jaishankar
Follow us
Janardhan Veluru

|

Updated on: Jan 12, 2024 | 4:12 PM

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు కర్ణాటకలో పార్టీ శ్రేణులను బీజేపీ అధిష్టానం సన్నద్ధం చేస్తోంది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తును ఇప్పటికే మొదలుపెట్టింది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఇద్దరు, ముగ్గురు కేంద్ర మంత్రులకు కర్ణాటక నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిపే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బెంగుళూరులో బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు జరిగిన లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి అర్జున్ సింగ్ సంకేతాలు ఇచ్చారు.ఇద్దరు, ముగ్గురు కేంద్ర మంత్రులను కర్ణాటక నుంచి లోక్‌సభ ఎంపీగా పోటీ చేయించాలని యోచిస్తున్నట్లు ఆయన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సూత్రప్రాయంగా తెలియజేశారు. అలా వారికి సీట్లు కేటాయిస్తే వారిని ఎన్నికల్లో గెలిపించేందుకు పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వం సన్నద్ధంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో కర్ణాటక నుంచి కేంద్ర మంత్రులు ఎవరెవరు పోటీ చేసే అవకాశముందన్న అంశం ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ కర్ణాటక నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే అవకాశముందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీకి విజయావకాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల నుంచే వారు పోటీ చేసే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. వీరు బెంగుళూరు సౌత్, బెంగుళూరు సెంట్రల్, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ నియోజకవర్గాల నుంచి పోటీ చేయొచ్చన్న టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభకు నిర్మలా సీతారామన్ ప్రాతినిధ్యంవహిస్తున్నారు.ఆమెకు దక్షిణ కన్నడ నియోజకవర్గం నుంచి బరిలో నిలపాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి కర్ణాటక మాజీ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు నలిన్ కుమార్ కతీల్ ప్రాతినిధ్యంవహిస్తున్నారు. దక్షిణ కన్నడలో బీజేపీ బలంగా ఉంది. 2009 నుంచి నలిన్ కుమార్ వరుసగా మూడుసార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పార్టీకి కంచుకోటగా నిలుస్తున్న ఈ నియోజకవర్గం నుంచి నిర్మలా సీతారామన్‌ బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రస్తుతం గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యంవహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆయన తరచూ బెంగుళూరులో పర్యటిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆయన బెంగుళూరులో ప్రచారం నిర్వహించారు. ఆయన్ను బెంగుళూరు సౌత్, బెంగుళూరు సెంట్రల్ లేదా ఉత్తర కన్నడ నియోజకవర్గాల్లో ఏదో ఒకచోటి నుంచి పోటీ చేయించాలన్నది కమలనాథుల ప్లాన్‌గా తెలుస్తోంది.

వీరితో పాటు మరో కేంద్ర మంత్రి కర్ణాటక నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే అవకాశముంది. అయితే సదరు కేంద్ర మంత్రి ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.