Kishan Reddy: లోక్‌సభలో ఖనిజాలు, గనుల చట్ట సవరణలపై కిషన్ రెడ్డి స్పీచ్ హైలెట్స్

లోక్‌సభలో MMDR చట్టంకి ఆరు ముఖ్యమైన సవరణలను ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయా అంశాలపై విపులంగా మాట్లాడారు. 2014కి ముందు గనుల రంగం పరిస్థితి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిందని తెలిపారు. పత్రికల్లో, టీవీల్లో ఎప్పటికప్పుడు అవినీతి, అస్పష్టత, రాజకీయ అనుకూలతల గురించి వార్తలు వచ్చేవన్నారు. అప్పటి కేంద్ర పాలకులు గనుల కేటాయింపులను కేవలం "పేపర్ స్లిప్" ద్వారా చేసేవారని ఆయన ఆరోపించారు.

Kishan Reddy: లోక్‌సభలో ఖనిజాలు, గనుల చట్ట సవరణలపై కిషన్ రెడ్డి స్పీచ్ హైలెట్స్
Union Minister Kishan Reddy

Updated on: Aug 12, 2025 | 7:29 PM

లోక్‌సభలో గనులు, ఖనిజాల (అభివృద్ధి & నియంత్రణ) చట్టంలో కొత్తగా ఆరు సవరణలు ఆమోదం పొందాయి. ఈ సందర్భంగా బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ పలు అంశాలపై వివరంగా, విపులంగా మాట్లాడారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం…

2014 కంటే ముందు గనుల రంగం పరిస్థితి: ఆ సమయంలో గనుల కేటాయింపులు పారదర్శకత లేకుండా చీటిల ద్వారా జరిగేవని, ఇది వార్తల్లో తరచూ ఉండేదని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. అప్పటి పాలకపక్షం, రాజకీయ నాయకుల బంధువులు, వారి అనుచరులు గనుల లీజులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

మోడీ సర్కార్ చేసిన సంస్కరణలు: 2014 తరువాత ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పూర్తిస్థాయి పారదర్శకత కోసం గనుల కేటాయింపులు పూర్తిగా వేలంపాటల ద్వారా మాత్రమే జరిగేలా చట్ట సవరణలు చేశారు. 2015, 2021, 2023లో సవరణలు వచ్చాయి. ఇప్పుడు మరో ఆరు సవరణలు తీసుకొచ్చారు.

సంక్షేమం, ఉపాధి కోసం కొత్త మార్గాలు: మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (DMF) ప్రారంభించారు. ఇది గనుల ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి, ఉపాధి సృష్టికి, ప్రజా సంక్షేమానికి ఉపయోగపడుతోంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి ఇది అమలు అవుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. అలాగే నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ (NMET) ద్వారా గనుల అన్వేషణకు పూర్తి సహకారం అందిస్తున్నామని చెప్పారు.

క్రిటికల్ మినరల్స్‌కు ప్రాముఖ్యత: పునరుత్పత్తి శక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు, హై-టెక్ టెక్నాలజీలకు క్రిటికల్ మినరల్స్ కీలకమని అన్నారు. దేశీయ ఉత్పత్తి పరిమితంగా ఉండటంతో దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌ను క్యాబినెట్ ఆమోదించిన తరువాత, దాన్ని సమర్థంగా అమలు చేయడానికి ఈ సవరణలు అవసరమని వివరించారు.

విదేశీ ఒప్పందాలు: ప్రధాని మోదీ ఇతర దేశాలకు వెళ్లినప్పుడు, అక్కడి దేశాధినేతలతో క్రిటికల్ మినరల్స్‌పై చర్చిస్తారని తెలిపారు. PSU KABIL ద్వారా విదేశాల నుండి క్రిటికల్ మినరల్స్ తెచ్చుకునే పనిలో ఉన్నామని.. లిథియం కోసం జాంబియా, అర్జెంటీనా వంటి దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని చెప్పారు.

అయితే అభివృద్ధికి ఉపయోగపడే ఈ సవరణలకు ప్రతిపక్షం మద్దతు ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కొందరు నాయకులు దేశ గనుల రంగంపై, సైన్యంపై, ఆర్థిక వ్యవస్థపై, న్యాయవ్యవస్థపై, పార్లమెంట్‌పై, ఎన్నికల సంఘంపై, మీడియాపై నమ్మకం లేకుండా దేశ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. మొత్తంగా ఈ సవరణల ద్వారా పారదర్శకత, ఉపాధి, గనుల అన్వేషణ, క్రిటికల్ మినరల్స్ భద్రత వంటి అంశాల్లో కొత్త దశకు తీసుకెళ్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.