లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటింది. కాంగ్రెస్ పూర్వ వైభవం దిశగా పయనిస్తోంది. యూపీలో బీజేపీకి ఇండియా కూటమి చుక్కలు చూపించింది. తమిళనాడు, బెంగాల్ , మహారాష్ట్ర , కేరళ రాష్ట్రాల్లో కూడా ఇండియా కూటమి హవా కొనసాగింది.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన విజయాలను నమోదు చేసుకుంది. గత 10 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించింది. 99 సీట్లలో కాంగ్రెస్ లీడ్ సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తారుమారయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పెరిగింది. అంతేకాదు ఇండియా కూటమి భాగస్వామి పార్టీలతో కలిసి ఎన్డీఏ కూటమికి ఈ ఎన్నికల్లో చుక్కలు చూపించింది.
కొత్త ప్రభుత్వ ఏర్పాటులో యూపీ చాలా కీలకం . అక్కడ 80 ఎంపీ సీట్లు ఉన్నాయి. యూపీలో మెజారిటీ సీట్లను ఇండియా కూటమి కైవసం చేసుకుంది. అక్కడ సమాజ్‌వాదీ పార్టీ సత్తా చాటింది. ఇండియా కూటమి అక్కడ 45 సీట్లకు పైగా ఆధిక్యాన్ని సాధించింది. కీలక యూపీలో రాజ్‌పుత్ ఓటు బ్యాంక్ కూడా సమాజ్‌వాదీ పార్టీ వైపు మొగ్గింది.
రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ దేశవ్యాప్త ప్రచారం పార్టీకి బాగా కలిసివచ్చింది. గతంలో పోలిస్తే మైనారిటీ ఓట్లను తమవైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ నేతలు సక్సెసయ్యారు. ముఖ్యంగా బీజేపీ అధికారం లోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారన్న ప్రచారం బాగా కలిసి వచ్చింది. రాహుల్‌గాంధీ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. యూపీ లోని రాయ్‌బరేలి, కేరళ లోని వయనాడ్ నుంచి రాహుల్ లక్షల మెజారిటీతో గెలుపొందారు.
రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్‌కు ప్లస్ పాయింట్‌గా మారింది. ప్రియాంక సుడిగాలి ప్రచారం కూడా పార్టీకి కలిసి వచ్చింది. పప్పు , షహెన్‌షా అంటూ బీజేపీ నేతలు చేసిన ప్రచారాన్ని ఈసారి సమర్ధవంతంగా తిప్పికొట్టడంతో రాహుల్‌గాంధీ సక్సెసయ్యారు. ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాహుల్ గాంధీ, యూపీ ప్రజలు చాలా విజ్ఞత చూపించారు. మీరు అద్భుతం చేసి చూపించారు. ఇతర రాష్ట్రాలతో పాటు యూపీ ప్రజలు కూడా మంచి ఫలితాలను ఇచ్చారంటూ రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించి యూపీ ప్రజలు చక్కని తీర్పును ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ రాజ్యాంగాన్ని రక్షించింది. అన్ని రాష్ట్రాలను నా ధన్యవాదాలు.. అలాగే ఉత్తరప్రదేశ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
యూపీ , మహారాష్ట్రతో పాటు తమిళనాడు , కేరళలో ఇండియా కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. మహారాష్ట్రలో శివసేన ఉద్దవ్ వర్గం తమదే అసలైన శివసేన నిరూపించుకుంది. అక్కడ కాంగ్రెస్ 12 సీట్లలో విజయం సాధించగా , ఉద్దవ్ వర్గం 10 స్థానాలను దక్కించుకుంది. మహారాష్ట్రలో బీజేపీకి 10 సీట్లు మాత్రమే లభించాయి. ఎన్సీపీ శరద్‌నపవార్ వర్గానికి 7 సీట్లు , అజిత్‌పవార్ వర్గానికి ఒక్క సీటు , షిండే వర్గానికి 7 సీట్లు లభించాయి.
తమిళనాడులో ఇండియా కూటమి క్లీన్‌స్వీప్ చేసింది. 39 సీట్లను కూటమి గెల్చుకుంది. అన్నాడీఎంకే , బీజేపీకి తమిళనాడులో ఒక్కసీటు కూడా రాలేదు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరులో ఓటమి పాలయ్యారు. పుదుచ్చేరి సీటును కూడా డీఎంకే సొంతం చేసుకుంది.
ఉత్తరాది రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలు బీజేపీ కొంపముంచినట్టు ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. పంజాబ్ , హర్యానా , యూపీ , రాజస్థాన్‌లో బీజేపీ గ్రాఫ్ తగ్గడానికి రైతుల వ్యతిరేకతే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…