Lok Sabha Poll percentage: ఈసారి పోలింగ్‌ శాతంపై సర్వత్రా ఉత్కంఠ.. ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?

|

May 26, 2024 | 9:07 AM

దేశంలో సార్వత్రిక ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం 7 విడతల్లో ఎన్నికలు జరగుతుండగా, ఇప్పటికే 6 విడతలు పూర్తయ్యాయి. అయితే భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి హిందీ రాష్ట్రాల్లో గతం కంటే కాస్త తక్కువ పోలింగ్ శాతం నమోదవుతుండగా, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో గతం కంటే ఎక్కువగా పోలింగ్ శాతం రికార్డ్ అయ్యింది. దీంతో ఇది దేనికి సంకేతమనే విశ్లేషణలు మొదలయ్యాయి.

Lok Sabha Poll percentage: ఈసారి పోలింగ్‌ శాతంపై సర్వత్రా ఉత్కంఠ.. ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
Voter Turnout Record
Follow us on

Lok Sabhha Election 2024: దేశంలో సార్వత్రిక ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం 7 విడతల్లో ఎన్నికలు జరగుతుండగా, ఇప్పటికే 6 విడతలు పూర్తయ్యాయి. అయితే భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి హిందీ రాష్ట్రాల్లో గతం కంటే కాస్త తక్కువ పోలింగ్ శాతం నమోదవుతుండగా, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో గతం కంటే ఎక్కువగా పోలింగ్ శాతం రికార్డ్ అయ్యింది. దీంతో ఇది దేనికి సంకేతమనే విశ్లేషణలు మొదలయ్యాయి.

సాధారణంగా గతం కంటే పోలింగ్ శాతం పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తుంటారు. అయితే చరిత్రను ఓసారి పరిశీలిస్తే, పోలింగ్ శాతం పెరిగిన ప్రతిసారీ అధికార మార్పిడి జరగలేదు. తగ్గిన ప్రతిసారీ ఉన్న ప్రభుత్వం కొనసాగలేదు. కొన్ని సందర్భాల్లో పోలింగ్ శాతం తగ్గినప్పుడూ ప్రభుత్వాలు మారాయి. పెరిగినప్పుడూ మారాయి. తాజాగా బీజేపీకి ఆయువు పట్టుగా భావించే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పోలింగ్ శాతంలో స్వల్ప తరుగుదల వెనుక కారణమేంటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. సానుకూల ఓటర్లలో ఏర్పడ్డ నిర్లిప్తతే కారణమా అన్న ఆందోళన అటు అధికార పార్టీని వెంటాడుతోంది. అయితే పోలింగ్ శాతం తక్కువగా నమోదవడం వెనుక హిందీ రాష్ట్రాలను గత కొన్నాళ్లుగా వెంటాడుతున్న భానుడి భగభగలు, తీవ్రమైన వేడిగాలులు కూడా కారణమేనని కొందరు భావిస్తున్నారు.

ఇక పశ్చిమ బెంగాల్ లాంటి తూర్పు రాష్ట్రాల్లో పెరిగిన పోలింగ్ శాతం వెనుక.. బంగ్లాదేశీ వలసలు, వారిని అభద్రతాభావంలో పడేసిన CAA-NRC లాంటివి పోలింగ్ శాతం పెరగడానికి కారణాలుగా కొందరు విశ్లేషిస్తున్నారు. అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న బీజేపీని ఓడించాలన్న ఉద్దేశం, ఆయా వర్గాల్లో కనిపిస్తోంది. అయితే ఇక్కడ వారి ఓటు ఏకపక్షంగా బీజేపీని జాతీయ స్థాయిలో వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌కు పడుతుందా..? లేక రాష్ట్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న తృణమూల్ కాంగ్రెస్‌కు పడుతుందా అన్నదీ అంతుచిక్కడం లేదు. విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే క్రమంలో చురుగ్గా వ్యవహరించిన మమతా బెనర్జీ.. తీరా ఎన్నికలు సమీపించే సమయానికి ప్లేటు ఫిరాయించి ఒంటరిగా పోటీ చేయడం వల్ల బీజేపీ వ్యతిరేక ఓటు అటు టీఎంసీ, ఇటు కాంగ్రెస్-కమ్యూనిస్టులతో కూడిన ఇండియా కూటమి మధ్య చీలిందని అర్థమవుతోంది. పరోక్షంగా ఇది బీజేపీకి లాభిస్తుందా లేదా అన్నదీ ఫలితాలు వెల్లడయ్యాకే తెలుస్తుంది.

ఇక దేశవ్యాప్తంగా పోలింగ్ శాతం సంగతెలా ఉన్నా.. బీజేపీకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని అనుకున్న అనేక సందర్భాల్లో ఆ పార్టీ మంచి ఫలితాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి. గత ఏడాది చివర్లో జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హిందీ రాష్ట్రాల్లో తిరుగులేని విజయం నమోదు చేయడం ఇందుకు ఉదాహరణ. ఆ సమయంలో బీజేపీ మూడు రాష్ట్రాలు గెలుస్తుందని ఏ ఒక్కరూ ఊహించలేదు. ఇప్పుడు కూడా జాతీయ స్థాయిలో అదే తరహా వాతావరణాన్ని సృష్టిస్తున్నారని, వాస్తవ పరిస్థితి మరోలా ఉందని కమలనాథులు చెబుతున్నారు. ఏదేమైనా.. లోలోన కమలదళాన్ని కలవరానికి గురిచేస్తున్న పోలింగ్ శాతం ఎన్నికల ఫలితాలను ఏమేరకు ప్రభావితం చేస్తుందన్నదే ఆసక్తికరమైన అంశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…