బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. రాంచీలోని రాజేందర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పరిస్థితి క్షీణించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా డాక్టర్ ఉమేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీలు ప్రస్తుతం 25 శాతం మాత్రమే పని చేస్తున్నాయని, ఆయన కిడ్నీ పనితీరు ఎప్పుడైనా పూర్తిగా క్షీణించవచ్చని అన్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉంది. అందుకే నేను ఈ విషయం గురించి లిఖితపూర్వకంగా తెలిపాను అని అన్నారు.
ఇప్పటికే అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న లాలూ.. తాజాగా కిడ్నీల పనితీరు మరింత క్షీణించింది. లాలూ డయాబెటిస్, రక్తపోటు, గుండె జబ్బులతో బాధపడుతున్నారు. ఈ కారణంగా కిడ్నీలు మరింత క్షీణించినట్లు వైద్యుడు ఉమేష్ ప్రసాద్ వెల్లడించారు. ఇదిలా ఉండగా, పశు దాణా కుంభకోణం కేసులో లాలూకు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను జార్ఖండ్ హైకోర్టు జనవరి 22కు వాయిదా వేసింది.
2018, ఆగస్టు 30న లాలూ అనారోగ్యం కారణంగా రిమ్స్‌లో చేరారు. గత అక్టోబర్‌లో లాలూకు చైబాసా ట్రెజరీ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ, దమ్కా ట్రెజరీ కేసులో బెయిల్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. డిసెంబర్ 2017న ఆయనకు దాణా కేసులో ఏడేళ్ల శిక్ష పడింది.1991 నుంచి 1996 మధ్య కాలంలో లాలూ సీఎంగా ఉన్న సమయంలో దమ్కా ట్రెజరీ నుంచి రూ.3.5 కోట్లు అక్రమంగా డ్రా చేశారనే ఆరోపణలు రుజువు కావడంతో ఆయనకు శిక్ష పడింది.