Lakhimpur Kheri violence case: యూపీలోని లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా (Ashish Mishra) ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆశిష్ మిశ్రా సరెండర్ అయ్యేందుకు సుప్రీం కోర్టు వారం రోజుల గడువు ఇచ్చింది. దీంతో డెడ్‌లైన్‌కు ఒక రోజు ముందే లొంగిపోయారు ఆశిష్ మిశ్రా. గతేడాది అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరీలో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతిచెందారు. అనంతరం చెలరేగిన హింసలో మరో నలుగురు మృతిచెందారు. డ్రైవర్, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో లఖింపూర్ ఖేరీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ప్రతిపక్షాలు యూపీ, కేంద్ర ప్రభుత్వాలపై ఆగ్రహంతో ఆందోళనలకు దిగాయి. ఘటన మరుసటి రోజు అక్టోబర్ 4న ఆశిష్ మిశ్రాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత ఈ కేసులో విచారణ చేపట్టిన సిట్ పక్కా ప్లాన్ ప్రకారమే ఈ ఘటన జరిగిందని తేల్చింది. ఆశిష్ మిశ్రానే ప్రధాన నిందితుడిగా తేల్చింది. ఆయన బంధువు సహా మొత్తం 14మందిపై మొత్తం 5వేల పేజీల చార్జిషీట్ దాఖలు చేసింది. రైతులపై ఆశిష్ మిశ్రా కాల్పులు జరిపినట్టు కూడా సిట్ నివేదిక వెల్లడించింది. అయితే అశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 10న బెయిల్ మంజూరు చేసింది.
కాగా.. దీనిపై బాధిత రైతుల కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. వారి పిటిషన్‌పై విచారణ నిర్వహించిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ ఈ నెల 18న ఆశిష్ మిశ్రా బెయిల్‌ను రద్దు చేసింది. వారంలోగా కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో తుది గడువుకు ఒక రోజు ముందుగానే ఆశిష్ మిశ్రా సరెండర్ అయ్యారు. సీజేఎం కోర్టులో లొంగిపోయిన ఆయనను పోలీసులు లఖింపూర్ ఖేరీ జిల్లా జైలుకి తరలించారు.
Also Read: