కోటా, సెప్టెంబర్ 13: రాజస్థాన్ కోటాలో మరో విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్‌కు ప్రిపేర్ కావడానికి కోటాకు వెళ్లిన ఆరు నెలల లోపే పదహారేళ్ల బాలిక తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతి చెందిన బాలికను జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన విద్యార్ధినిగా పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ఏడాది కోటాలో సూసైడ్ చేసుకున్న విద్యార్ధుల సంఖ్య 24కి చేరింది. అసలేం జరిగిందంటే..
విజ్ఞాన్ నగర్ పోలీస్ స్టేషన్‌లోని సబ్-ఇన్‌స్పెక్టర్ అసిస్టెంట్ అమర్ చంద్ మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి 10.30 గంటలకు సిన్హా (16) అనే విద్యార్ధిని తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన హాస్టల్ సిబ్బంది హుటాహుటీన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఐతే విద్యార్ధిని గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చాంద్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంబీఎస్ ఆస్పత్రికి తరలించారు.
దీనిపై హాస్టల్ వార్డెన్ అర్చన రాజావత్ మాట్లాడుతూ.. గత రాత్రి అస్వస్థతకు గురికాగా తనకు మందులు కూడా ఇచ్చిందని తెలిపారు. సిన్హా ఎప్పుడూ సంతోషంగా ఉండేది. ఆమెలో ఒత్తిడి సంకేతాలు నాకెప్పుడూ కనిపించలేదు. తన స్నేహితులతో కూడా కలుపుగోలుగా ఉండేది. సమయానికి భోజనం చేసేదని చెప్పుకొచ్చింది. కాగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE), మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ కోసం నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET) వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఏటా 2.5 లక్షల మంది విద్యార్థులు రాజస్థాన్‌లోని కోటాలోని పలు కోచింగ్ సెంటర్లకు వస్తుంటారు. ఐతే ఇక్కడికి వచ్చిన విద్యార్ధులు ఒత్తిడి తట్టుకోలేక ఏటా అధిక సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళ కలిగిస్తోంది. 2023 సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఇప్పటివరకు 23 మంది విద్యార్ధులు తనువు చాలించారు. ఆగస్టు 27న కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్ధులు తమ జీవితాలకు ముగింపు పలికారు. గత ఏడాది ఈ సంఖ్య 15గా ఉండగా ఈ ఏడాది ఏకంగా 24 మంది ఆత్మహత్యకు పాల్పడటం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.
సంఘటనలు రికార్డు స్థాయిలో పెరగడంతో.. ఫ్యాన్లలో యాంటీ-హాంగింగ్ పరికరాన్ని తప్పనిసరిగా అమర్చడం, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లను రెండు నెలల పాటు ఎలాంటి పరీక్షలకు హాజరుకావద్దని ఆదేశించడంతో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. యాంటీ హ్యాంగింగ్ పరికరం ఎలా పనిచేస్తుందంటే.. 20 కిలోల కంటే ఎక్కువ బరువున్న వస్తువును ఫ్యాన్‌కు వేలాడదీస్తే, దానికి సంబంధించిన స్ప్రింగ్ విస్తరించి కిందకు జారుతుంది. అలాగే ఆ సమయంలో సైరన్ కూడా మోగుతుంది. కోటలోని హాస్టళ్లలోని బాల్కనీలు, లాబీలలో వలలు కూడా ఏర్పటు చేశారు. ఒకసారి వారి ప్రయత్నం విఫలమైతే, అటువంటి విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వవచ్చని అధికారులు తెలుపుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.