కోల్‌కతాలో హై టెన్షన్.. డాక్టర్‌‌పై హత్యాచార ఘటనపై విద్యార్ధి సంఘాల ఆందోళన.. తీవ్ర ఉద్రిక్తత

|

Aug 27, 2024 | 3:11 PM

పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌ పై హత్యాచార ఘటనపై నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్ధి సంఘాలు సెక్రటేరియట్‌ను ముట్టడించాయి.

కోల్‌కతాలో హై టెన్షన్.. డాక్టర్‌‌పై హత్యాచార ఘటనపై విద్యార్ధి సంఘాల ఆందోళన.. తీవ్ర ఉద్రిక్తత
Kolkata Doctor Case
Follow us on

పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన మమత ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ ఘటనపై నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్ధి సంఘాలు మంగళవారం సెక్రటేరియట్‌ను ముట్టడికి పిలుపునిచ్చాయి.. కోలక్‌కతాలో ‘పశ్చిమబంగా ఛాత్రో సమాజ్‌’ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. ‘నబన్నా అభియాన్’ పేరుతో విద్యార్థులు భారీ ర్యాలీని చేపట్టారు.

సెక్రటేరియట్‌ను ముట్టడి నేపథ్యంలో విద్యార్ధులకు, పోలీసులకు మధ్య పలు చోట్ల ఘర్షణ చెలరేగింది. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్చ్‌లో పాల్గొన్న ఆందోళనకారులు.. బారికేడ్లను బద్దలుకొట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వారిపై బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీఛార్జ్‌ చేయడంతోపాటు గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఆందోళనకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. హింసకు పాల్పడితే సహించేది లేదని పేర్కొంటున్నారు. కాగా.. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.

పోలీసులు లాఠీఛార్జ్‌ చేసినప్పటికి , భాష్ఫవాయువు ప్రయోగించినప్పటికి ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. హౌరా బ్రిడ్జి దగ్గర బైఠాయించారు. ప్రస్తుతం హౌరా బ్రిడ్జిపై విద్యార్ధులు ధర్నా కొనసాగిస్తున్నారు.. లాఠీఛార్జ్‌లో పలువురు విద్యార్ధులకు గాయాలైనట్లు పేర్కొంటున్నారు. భారీ ఆందోళనల నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ నివాసం వద్ద భారీగా బలగాలను మోహరించారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కోల్‌కతాలో హై టెన్షన్ నెలకొంది..

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థినిపై హత్యచారం కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది.. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య జరిగింది.. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు లై డిటెక్టర్ పరీక్షలు సైతం నిర్వహించారు. ఇప్పటివరకు ఆర్‌జీ కర్‌ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ఘోష్‌తో సహా ఆరుగురికి పాలిగ్రాఫ్‌ టెస్ట్‌లు నిర్వహించి వివరాలు సేకరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..