Kishan Reddy: మోదీ వారందరికీ పెద్ద కొడుకయ్యారు.. ఆయుష్మాన్‌ భారత్‌పై కిషన్‌ రెడ్డి

కేంద్ర ప్రభుత్వంత తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఈ నిర్ణయంతో 70 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ పెద్ద కొడుకుగా మారారని తెలిపారు. ఈ పథకంలో భాగంగా వచ్చే రెండేళ్లలో ఎంత ఖర్చు చేయనున్నారో తెలిపారు..

Kishan Reddy: మోదీ వారందరికీ పెద్ద కొడుకయ్యారు.. ఆయుష్మాన్‌ భారత్‌పై కిషన్‌ రెడ్డి
Kishan Reddy, Narendra Modi
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 13, 2024 | 3:01 PM

దేశంలో ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దేశంలో 70 ఏళ్లు పైబడిన వారందరినీ ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు నిండిన వారంతా ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వంత తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఈ నిర్ణయంతో 70 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ ఆయన పెద్ద కొడుకుగా మారారని తెలిపారు. ఈ పథకంలో భాగంగా వచ్చే రెండేళ్లలో (2024-25, 2025-26) కేంద్ర ప్రభుత్వం రూ. 3437 కోట్లు ఖర్చు చేయనుందని చెప్పుకొచ్చారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 70 ఏళ్లు నిండిన 6 కోట్ల మందికి లబ్ధి చేకూరనుందని, కేవలం పేద వారికి మాత్రమే కాకుండా మధ్యతరగతి, ఉన్నత వర్గాల్లో ఉన్న వారికి కూడా ఈ పథకాన్ని అమలు చేయనున్నామని చెప్పుకొచ్చారు.

ఇక కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణలో 10 లక్షల మంది వృద్ధులకు లబ్ధి చేకూరనుందని కిషన్‌ రెడ్డి అన్నారు. కొత్త పథకంలో భాగంగా AB PMJAY కింద 70 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరికీ ప్రత్యేకంగా రూపొందించిన కొత్త కార్డులను జారీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇక వృద్ధుల సంరక్షణ కోసం ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన ద్వారా 90 శాతం తగ్గింపు ధరతో నిత్యవసర వస్తువులు, ఉచితంగా 5 కిలోల ఆహార ధాన్యాలను అందిస్తోందని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే దేశంలో పేదల ప్రజలకు వైద్యం కోసం కేంద్ర ప్రభుత్వం 2018 సెప్టెంబర్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో చేరిన వారికి ఆయుష్మాన్‌ కార్డును అందిస్తారు. రూ. 5 లక్షల వరకు అయ్యే వైద్యాన్ని ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుంది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా 2011 సోషియో ఎకనామిక్‌ క్యాస్ట్‌ (SECC) ప్రకారం అర్హులైన పేదలకు ఈ పథకం వర్తింపజేశారు. అయితే తాజాగా 70 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ ఈ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..