Farmers: మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి అన్ని వర్గాల వారికి మేలు జరుగుతోంది. ముఖ్యంగా రైతుల విషయంలో అనేక పథకాలను ప్రవేశపెడుతోంది కేంద్ర ప్రభుత్వం. రైతులకు సాయంగా ఖాతాలో డబ్బులు జమ చేయడమే కాకుండా ఇతర పథకాల ద్వారా ఆదాయం వచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న మరో వరం కిసాన్ క్రెడిట్ కార్డు. ఈ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు రూ.16 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందులో రూ.14 లక్షల రుణాలను ఇచ్చింది. కేంద్ర సర్కార్ లక్షాన్ని చేరుకోవాలంటే మరో రూ.2 లక్షల కోట్ల రుణాలను రైతులకు ఇవ్వాలి. అయితే రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. వ్యవసాయం చేసే రైతులు మార్కెట్‌లో ఎక్కువ వడ్డీకి అప్పులు చేయకుండా బ్యాంకుల దగ్గరే తక్కువ వడ్డీకి రుణాలు పొందే అవకాశం ఉంటుంది.
అర్హులైన రైతులు ఈ బెనిఫిట్స్ పొందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నేతృత్వంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. వచ్చే ఏడాది నాటికి రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా రుణాలు ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో కూడా ఈ స్కీమ్ ద్వారా రైతులకు రుణాలు ఇచ్చామని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పథకాలు అర్హులైన రైతులకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ గురించి రైతులకు అవగాహన కల్పించేందుకు 2020 ఫిబ్రవరిలో ప్రచార కార్యక్రమం సైతం చేపట్టామన్నారు.
కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా రూ.16 లక్షల రుణాలు ఇవ్వాలనుకున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ఇప్పటికే రూ.14 లక్షలు ఇచ్చామని, కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ దరఖాస్తులను స్వీకరించేందుకు బ్యాంక్ బ్రాంచ్‌లల్లో క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా రైతులు ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ.1,60,000 వరకు రుణం పొందవచ్చు. అదనంగా కాంప్లిమెంటరీ ఇన్స్యూరెన్స్ కవరేజీ కూడా లభిస్తుంది. పంట కోతలు, మార్కెటింగ్‌ను బట్టి అప్పు తిరిగి చెల్లించే వెసులుబాటు ఉంటుంది.
రైతులు తమకు దగ్గరలో ఉన్న బ్యాంకులో కిసాన్ క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. పంట ఉత్పత్తి, వ్యవసాయేతర కార్యకలాపాలు, ఇతర అనుబంధ సంస్థలు కూడా కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు.
కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవడానికి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, యూఐడీఏఐ జారీ చేసిన లెటర్స్‌ని ఐడీ ప్రూఫ్ లేదా అడ్రస్ ప్రూఫ్, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఐడీ కార్డును ఇవ్వవచ్చు. మూడు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
మీరు మీ సమీపంలో ఉన్న బ్యాంకుకు వెళ్లి కిసాన్ క్రెడిట్ కార్డు సెక్షన్‌లో దరఖాస్తు ఫామ్ తీసుకోవాలి. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి అందజేయాలి. లోన్ అధికారులు దరఖాస్తును పరిశీలించి కిసాన్ క్రెడిట్ కార్డును జారీ చేస్తారు. ఈ మొత్తం ప్రాసెస్‌లో బ్యాంకు సిబ్బంది సహకారం తీసుకోవచ్చు.
ఈ కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకుంటే ఎంతో మేలు ఉంటుంది. తక్కువ వడ్డీతోనే తీసుకున్న రుణాన్ని చెల్లించుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా ఇచ్చే రుణాలకు 9 శాతం వడ్డీ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 2 శాతం సబ్సిడీ ఇస్తుంది. మిగతా 7 శాతం వడ్డీ రైతులు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. మీరు తీసుకున్న రుణాన్ని గడువు లోగా చెల్లించినట్లయితే 3 శాతం వడ్డీ తగ్గుతుంది. అంటే రైతులకు 4 శాతం వడ్డీకే రుణాలు లభిస్తాయి. ఇలాంటి సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకుంటే ఎంతో మంచిది. ఆర్థిక ఇబ్బందులున్న సమయంలో ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.