ఒకనాడు తన 18 ఏళ్ళ వయస్సులో బతుకుదెరువు కోసం నిమ్మరసం, ఐస్ క్రీమ్ అమ్మిన పేద మహిళ ఇప్పుడు తాను అసలు ఊహించని ఎస్ఐ ఉద్యోగం చేస్తోందంటే నమ్మశక్యం కాకున్నా ఇది వాస్తవం…ప్రస్తుతం కేరళ లోని వర్కల ప్రాంత పోలీసు స్టేషన్ లో ఆమె సబ్ ఇన్స్పెక్టర్.. ఈ మహిళ ఉదంతంలోకి వెళ్తే…..అనీ శివ అనే ఈ మహిళ తన కాలేజీ చదివే రోజుల్లో ఒకరిని ప్రేమించింది. తన తలిదండ్రులకు ఇష్టం లేకున్నా అతడిని పెళ్లాడింది. దీంతో ఆమె తలిదండ్రులు ఆమెపై కోపం పెంచుకుని పూర్తిగా ఆమెను బహిష్కరించారు. అటు ఈమెను పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా ఏ కారణం వల్లో అనీని వదిలి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి తన ఆరు నెలల పసిబిడ్డతో అనీ వీధి పక్కన నిమ్మరసం, ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ బతుకు సాగించింది. కొంతకాలం ఆ వ్యాపారం సాగినా ఆ తరువాత అది కూడా కుంటుపడడంతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉండగా…. ఓ వ్యక్తి ఆమెకు కొంత డబ్బు సాయం చేసి ఎస్ఐ పోస్టుకు లిఖిత పరీక్ష రాయాలని ప్రోత్సహించాడు. అలా అందుకు ప్రయత్నిస్తూనే కొంతకాలం పాటు తన గ్రాండ్ మదర్ ఇంట్లో..చివరకు ఓ షెడ్ లో ఉంటూ అనీ మొత్తానికి ఎస్ఐ పోస్టుకు పరీక్ష రాసి పాసయ్యింది. ఈ పోస్టుకు ఎంపికైంది.
తాను ఏనాడూ ఊహించని ఈ పోలీసు ఉద్యోగంలో చేరినందుకు ఎంతో సంతోషిస్తున్నానని 31 ఏళ్ళ అనీ అంటోంది. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ జాబ్ లో చేరగలిగానని, తన నుంచి ఇతర మహిళలు కూడా స్ఫూర్తిని పొంది తమ జీవితాలను బాగు పరుచుకోవాలని ఈమె ఫేస్ బుక్ ద్వారా కోరుతోంది. వర్కల పోలీసు స్టేషన్ లో ఎస్ఐ ప్రొబేషనరీ ఆఫీసరుగా ఉన్న ఈమెను ఉన్నతాధికారులు కూడా అభినందిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Mega Young Heroes: చిన్నతనం నుంచి ఏమీ మారలేదంటూ మెగా యంగ్ హీరోల సెల్ఫీ .. సోషల్ మీడియాలో వైరల్ ..
Global Vaccination: కోవిడ్ వ్యాక్సినేషన్‌లో సరికొత్త రికార్డు.. బ్రిటన్, అమెరికాలను దాటేసిన భారత్