మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న భవనంలో సోమవారం (ఫిబ్రవరి 13) భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆసుపత్రిలోని పలువురు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆసుపత్రిలోని డయాలసిస్ యూనిట్, జనరల్ మెడిసిన్, ఇతర వార్డుల్లో 100 మందికి పైగా రోగులను మరో భవనానికి తరలించారు. ఈ దుర్ఘటన కేరళలోని కొట్టాయంలో చోటుచేసుకుంది. పది ఫైర్ ఇంజన్ వాహనాలు ఆసుపత్రికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలతో భీతావాహకంగా తయారైంది.
ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు ఎవ్వరికీ ప్రాణనష్టం జరగలేదని సమాచారం. కాగా మెడికల్ కాలేజీ ఆసుపత్రి మూడో వార్డు వెనుక భాగంలో కొత్తగా 8 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. భవనంలోని స్టోర్ రూమ్‌లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ స్పందిస్తూ.. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని వైద్య విద్యాశాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.