
అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అనుమానంతో భార్య, ఆమె స్నేహితుడిని హతమార్చాడు ఓ భర్త. పొరుగింట్లో ఉంటున్న ఓ వివాహితకు ఆమె స్నేహితుడు వాట్సప్‌లో పంపిన ఎమోజీ వారిద్దరి ప్రాణాలే తీసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేరళలోని కలంజూర్ గ్రామానికి చెందిన 32 ఏళ్ల వ్యక్తి తన భార్య, ఆమె స్నేహితుడి మధ్య అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో వారిద్దరినీ హత్య చేశాడని పోలీసు అధికారులు సోమవారం తెలిపారు.
పథనంథిట్ట జిల్లా కలంజూరుకు చెందిన బైజు, తన భార్య వైష్ణవి(27)తో కలిసి నివాసం ఉంటున్నాడు. వారికి పది, ఐదేళ్ల వయసు కలిగిన ఇద్దరు కుమారులు ఉన్నారు. వాళ్ల ఇంటి పక్కనే విష్ణు(30) అనే యువకుడు తల్లితో కలిసి ఉంటున్నాడు. విష్ణు ఓ సారి వైష్ణవి వాట్సప్‌కు ముద్దు ఎమోజీని పంపాడు. ఆమె ఫోన్‌లో మెసేజ్‌ను చూసిన బైజు తన భార్యతో గొడవపడ్డాడు. అదే సమయంలో భయంతో పక్కనే ఉన్న విష్ణు ఇంట్లోకి వెళ్లింది. దీంతో మరింత ఆగ్రహానికి గురైన బైజు కొడవలితో భార్య వైష్ణవిని నరికాడు. బైజును ఆపడానికి వెళ్లిన విష్ణుపైనా దాడి చేశాడు.
కొడవలి వేటుకు తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత బైజు తన స్నేహితుడికి ఫోన్ చేసి రెండు హత్యలను చేసినట్లు చెప్పాడు. దీంతో స్నేహితుడు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బైజును అరెస్టు చేశారు. ఆదివారం(మార్చి 2) రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..