
కేరళ ప్రభుత్వం – అక్కడి గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మధ్య మరో వివాదం మొదలైంది. తనపై దాడి చేయించేందుకు ముఖ్యమంత్రి విజయన్ కుట్ర చేశారని గవర్నర్ ఖాన్ ఆరోపించారు. తాను తిరువనంతపురం ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న సమయంలో SFI కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నల్ల జెండాలు పట్టుకొని నిరసనకు దిగారని అన్నారు. కొందరు తన కారు అద్దాలు పగులగొట్టే ప్రయత్నం చేశారని తెలిపారు. ఆందోళనకారులంతా పోలీసు వాహనాల్లో వచ్చారని ఆరోపించారు. తాను కారు దిగడంతో వాళ్లంతా చెల్లచెదురయ్యారని తెలిపారు. తనను ముట్టడించిన వారిని అరెస్టు చేయవద్దని సీఎం కార్యదర్శి చెప్తుండటం తాను విన్నానని గవర్నర్ ఆరీఫ్ మహమ్మద్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
కేరళ సీఎం విజయన్ ప్రోద్బలంతోనే SFI కార్యకర్తలు తనపై దాడికి దిగారని గవర్నర్ ఆరోపించారు. ఢిల్లీ వచ్చిన గవర్నర్ ఆరీఫ్ మహమ్మద్ ఖాన్ ఈ ఉదయం మీడియాతో మాట్లాడారు. తన కారు కొత్తదని, కొని ఆరు నెలలు కూడా కాలేదని తెలిపారు. ఆ కారు అద్దాలు మొత్తం ధ్వంసమయ్యాయని అన్నారు. విద్యార్థులు నల్లజెండాలు ఊపినా, తనకు వ్యతిరేకంగా నినాదాలు చేసినా, తాను పట్టించుకోనని, కాని విద్యార్థుల ముసుగులో వారిని సీఎం విజయన్ పంపించారని ఆరోపించారు. స్వయంగా పోలీసు శాఖను చూస్తున్న సీఎం విజయన్ ఇలాంటి ఆదేశాలు జారీ చేస్తే పాపం పోలీసులు ఏం చేస్తారని ఆరీఫ్ మహమ్మద్ ఖాన్ వాపోయారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…