కశ్మీరీ పండిట్ల పునరాగమనం.. శ్రీనగర్‌లో జూన్ 6 నుంచి చారిత్రక గ్లోబల్ సదస్సు!
మూడు దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. కశ్మీరీ పండిట్ల ఆత్మగౌరవాన్ని తిరిగి నిలబెట్టేందుకు, వారి ఘనమైన వారసత్వాన్ని రాబోయే తరాలకు అందించేందుకు కశ్మీర్ గడ్డపై ఒక సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. జూన్ మొదటి వారంలో శ్రీనగర్ వేదికగా జరగనున్న అంతర్జాతీయ సదస్సు ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కశ్మీరీ పండిట్లు మళ్లీ తమ సొంత గూటికి చేరనున్నారు.

శ్రీనగర్ వేదికగా కశ్మీరీ పండిట్ల జీవితాల్లో మరో చారిత్రక ఘట్టం త్వరలో ఆవిష్కృతం కాబోతోంది. సుదీర్ఘ ప్రవాసం తర్వాత సొంత గడ్డపైకి పండిట్లను ఆహ్వానిస్తూ భారీ సదస్సుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సరిగ్గా ముప్పై ఆరు ఏళ్ల క్రితం కశ్మీరీ పండిట్లు తమ సొంత రాష్ట్రం నుంచి వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తమ మూలాలను వెతుక్కుంటూ వారు స్వస్థలానికి చేరుకునేలా ఈ భారీ కార్యక్రమాన్ని రూపొందించారు. గ్లోబల్ కశ్మీరీ పండిట్ డయాస్పోరాతో సహా మొత్తం ఏడు ప్రధాన సంఘాలు దీనికి శ్రీకారం చుట్టాయి. వీటికి తోడు దేశవిదేశాల్లోని మరో ముప్పైకి పైగా సంస్థలు ఈ చారిత్రక కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం విశేషం.
ఈ సదస్సు జూన్ ఆరో తేదీ నుంచి జూన్ పద్నాలుగో తేదీ వరకు కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో జరగనుంది. ప్రధాన సదస్సును జూన్ పదమూడు, పద్నాలుగు తేదీల్లో షేర్ ఏ కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రవాసం నుంచి ప్రతిభ వైపు అనే ప్రధాన ఇతివృత్తంతో కశ్మీరీ పండిట్ల పునరుజ్జీవనం, వాపసీ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు.
దేశవిదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు కశ్మీర్ లోని ప్రధాన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక కేంద్రాలను ఈ టూర్ లో భాగంగా సందర్శిస్తారు. కేవలం ఒక పర్యటనలా కాకుండా కశ్మీరీ పండిట్ల నాగరికత, జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసుకునేలా భావోద్వేగపూరిత వాతావరణంలో దీన్ని డిజైన్ చేశారు. మేధావులు, విధాన నిర్ణేతలు, పారిశ్రామికవేత్తలు, కళాకారులు, యువత ఈ సదస్సులో పాల్గొని తమ భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చిస్తారు.
ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అలాగే జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాయే కాకుండా ఇతర ప్రధాన రాజకీయ పార్టీల నేతలకు కూడా ఆహ్వానాలు పంపించారు. కశ్మీరీ ముస్లింలు, సిక్కులు, పీఓజేకే వర్గాల ప్రతినిధులను సైతం కలుపుకుని సమ్మిళిత చర్చలు జరపాలని నిర్వాహకులు నిర్ణయించారు.
ఈ సదస్సు కశ్మీరీ పండిట్ల ఆత్మగౌరవాన్ని తిరిగి నిలబెట్టడంతో పాటు పదికాలాల పాటు వారి వారసత్వాన్ని కాపాడేందుకు ఉపయోగపడుతుంది. కశ్మీర్ లో తిరిగి తమ మూలాలను వెతుక్కునేందుకు రాబోయే తరాలకు ఇది ఒక బలమైన పునాదిగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అమెరికా, యూరప్, పశ్చిమాసియా సహా ప్రపంచ నలుమూలల నుంచి రాబోయే ప్రతినిధులతో కశ్మీర్ లో కొత్త అధ్యాయం మొదలుకానుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
