Bihar Politics: బీహార్ న్యాయశాఖ మంత్రి, ఆర్జేడీ నేత కార్తీక్ కుమార్ ఎట్టకేలకు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి న్యాయశాఖ మంత్రి పదవి ఇవ్వడంతో విపక్ష బీజేపీ పెద్ద ఎత్తున ఈఅంశంపై ఆందోళన చేపట్టింది. నితీష్ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రి కిడ్నాప్ కేసులో నిందితుడు అంటూ నిరసనలు చేపట్టడం, ప్రజల్లోకి ఈవిషయాన్ని ప్రతిపక్ష బీజేపీ బలంగా తీసుకెళ్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రిమండలి నుంచి వైదొలగాల్సి వచ్చింది. తొలుత మంత్రి పదవి మారుస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. న్యాయశాఖ మంత్రి నుంచి చెరకు శాఖ మంత్రిగా మార్చారు. అయినప్పటికి.. విపక్షాల నుంచి నిరసనలు ఆగకపోవడంతో శాఖ మార్చిన కొద్దిసేపటికే కార్తీక్ కుమార్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన రాజీనామాను గవర్నర్ సైతం ఆమోదించారు.
2014లో జరిగిన ఓ కిడ్నాప్ కేసులో మంత్రి కార్తీక్ కుమార్ నిందితుడిగా ఉండటంతో విపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆందోళనలు చేశాయి. ఈ నిరసనల నేపథ్యంలో కార్తీక్ కుమార్‌ను.. బిహార్ సీఎం నితిష్ కుమార్ న్యాయశాఖ మంత్రి బాధ్యతల నుంచి తప్పించి.. ఆయనకు తక్కువ ప్రాధాన్యత కలిగిన చెరుకు శాఖను అప్పగించారు. అయినప్పటికీ ఆందోళనలు కొనసాగడంతో కొత్త శాఖను కేటాయించిన గంటల వ్యవధిలోనే కార్తీక్ కుమార్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కార్తీక్ కుమార్ రాజీనామాతో.. రెవెన్యూశాఖ మంత్రి అలోక్ కుమార్ మెహతాకు చెరుకు శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..