Govt Residential School: మగ శిశువుకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక.. హాస్టల్‌ వార్డెన్‌ సస్పెండ్‌

|

Jan 12, 2024 | 3:35 PM

ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో చదువుతోన్న 9వ తరగతి విద్యార్ధిని ప్రసవించిన ఘటన కలకలం సృష్టించింది. 8 నెలల గర్భవతైన బాలిక ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో హాస్టల్‌ వార్డెన్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. దీనిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని చిక్కబల్లాపూర్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని తుమకూరు జిల్లా చిక్కబళ్లాపూర్‌లోని ఓ హాస్టల్‌లో..

Govt Residential School: మగ శిశువుకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక.. హాస్టల్‌ వార్డెన్‌ సస్పెండ్‌
Class 9 Student Gives Birth To Boy
Follow us on

చిక్కబల్లాపూర్, జనవరి 12: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో చదువుతోన్న 9వ తరగతి విద్యార్ధిని ప్రసవించిన ఘటన కలకలం సృష్టించింది. 8 నెలల గర్భవతైన బాలిక ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో హాస్టల్‌ వార్డెన్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. దీనిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని చిక్కబల్లాపూర్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని తుమకూరు జిల్లా చిక్కబళ్లాపూర్‌లోని ఓ సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో 9వ తరగతి చదువుతోన్న 14 యేళ్ల బాలిక నగరంలోని ఓ ఆస్పత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటనతో ఆ హాస్టల్ వార్డెన్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. బాలిక ఏడాది క్రితం 8వ తరగతి చదువుతుండగా హాస్టల్‌లో చేరింది. ఆ అమ్మాయి 10వ తరగతి అబ్బాయితో సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. విద్యార్థులిద్దరూ ఒకే పాఠశాలలో చదువుతున్నారు. బాలుడు టీసీ తీసుకుని బెంగళూరు వెళ్లిపోయాడు. అయితే గత కొంత కాలంగా బాలిక తరగతులకు సక్రమంగా హాజరుకావడం లేదని, బంధువుల వద్దకు తరచూ వెళ్లేదని పోలీసుల విచారణలో తేలింది.

గత ఏడాది ఆగస్టులో ఆమెకు వైద్య పరీక్షలు కూడా జరిగాయి. అయితే అప్పటికి బాలిక గర్భం దాల్చలేదు. ఈ ఘటనపై తుమకూరులోని సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కృష్ణప్ప ఎస్‌ మాట్లాడుతూ.. చాలా కాలంగా చిన్నారి హాస్టల్‌కు రావడం లేదు. బాలిక స్వస్థలం బాగేపల్లి పట్టణంలోని కాశాపురం. బాలిక కడుపు నొప్పితో బాధపడుండటంతో ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడే ఈ విషయం వెలుగు చూసింది. అక్కడి వైద్యులు పరీక్షించి బాలిక గర్భం దాల్చినట్లు గుర్తించారు. అనంతరం బాలికకు పురిటి నొప్పులు రావడంతో జనవరి 9న వైద్యులు ప్రసవం చేశారు. శిశువు బరువు తక్కువగా ఉందని, అయితే తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు.

ఆసుపత్రి అధికారులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు పిల్లల రక్షణ చట్టంలోని పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. బాలికకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కౌన్సెలింగ్ చేయగా.. బాలిక గర్భం దాల్చడానికి తమ పాఠశాలలో చదువుతోన్న మైనర్ బాలుడని చెప్పింది. అయితే విచారణలో బాలుడు తనకేం తెలియదని చెప్పాడు. బాలిక మరో విద్యార్ధి పేరు కూడా చెప్పడంతో.. బాధ్యులెవరో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని, బాలిక ఆమె తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.