Watch: బాంబుతో ప్రియురాలిని బెదిరిద్దామనుకుంటే సీన్ రివర్స్.. క్షణాల్లో సజీవదహనమైన ప్రియుడు
ఓ యువతి కిడ్నాప్, హత్యాయత్నం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడింది. యువతిని బలవంతంగా తీసుకెళ్తున్న వ్యక్తి ప్రయాణిస్తున్న కారులో భారీ పేలుడు సంభవించడంతో అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో బెంగళూరు-పుణె జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..

బెంగళూరు, జూన్ 28: కర్ణాటకకు చెందిన నాగేంద్ర (30) అనే వ్యక్తి, బెంగళూరులోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల రమ్య నాయక్‌ను కొంతకాలంగా వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడు. గత ఆరేళ్లుగా స్నేహంగా ఉంటున్న వీరిద్దరూ కొంత కాలంగా మాట్లాడుకోవడం లేదు. ఈ క్రమంలో రమ్య అతడి ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసి, దూరంగా ఉంటోంది. రమ్య ఇటీవల అతనికి దూరంగా ఉంటుండటంతో నాగేంద్ర తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. శనివారం నాగేంద్ర బెంగళూరులోని రమ్య అద్దె గదికి వెళ్లి కత్తితో బెదిరించి బలవంతంగా ఓ క్యాబ్‌లో ఎక్కించాడు. అనంతరం ఆమెను అంకోలాకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు.
ఈ విషయాన్ని గమనించిన రమ్య రూమ్‌మేట్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వాహనాన్ని గుర్తించి క్యాబ్ డ్రైవర్‌ను సంప్రదించారు. సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా హైవే పెట్రోలింగ్ యూనిట్ వద్ద వాహనాన్ని ఆపాలని సూచించారు. పోలీసులతో డ్రైవర్ మాట్లాడుతున్న విషయం తెలుసుకున్న నాగేంద్ర ఆగ్రహానికి గురయ్యాడు. తనను వివాహం చేసుకోవాలని, లేకపోతే హత్య చేస్తానని బెదిరించాడు. లేదంటే ‘మనిద్దరం కలిసి చనిపోదాం’ అని రమ్యతో చెప్పి, అనంతరం అతడు రమ్యపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. తర్వాత తన వద్ద అప్పటికే తెచ్చుకున్న పెట్రోల్ బాంబ్‌ను బయటకు తీశాడు. కారులో పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో డ్రైవర్ వెంటనే వాహనాన్ని రోడ్డుపక్కన ఆపాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని రమ్య, డ్రైవర్ ఇద్దరూ కారులో నుంచి బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు.
In a sensational turn of events in the Tumakuru petrol bomb case, police have revealed that a jilted lover kidnapped his former girlfriend, stabbed her inside a moving car, and then detonated a petrol bomb, burning himself alive.
The woman, Ramya, escaped with serious injuries… https://t.co/tH4LeMCcqe pic.twitter.com/BxeHrkZcYM
— Hate Detector 🔍 (@HateDetectors) June 27, 2026
వారు బయటకు వచ్చిన కొద్ది సెకన్లకే కారులో భారీ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు కారు పూర్తిగా మంటల్లో చిక్కుకోగా, నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో రమ్యకు కత్తిపోట్ల గాయాలు కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. దీనిపై తుమకూరు జిల్లా ఎస్పీ అశోక్ కేవీ మాట్లాడుతూ ఘటనాస్థలాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారని తెలిపారు. పేలుడుకు కారణమైన పదార్థం ఏమిటి, పేలుడు ఎలా సంభవించింది అనే అంశాలపై విచారణ కొనసాగుతోందన్నారు. ప్రేమ వ్యవహారం, వివాహ వివాదం నేపథ్యంలో ఈ ఘటనను ముందస్తుగా పథకం వేసుకున్న హత్య? లేదా ఆత్మహత్యాయత్నమా? అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.




