Karnataka Bandh: ముదురుతున్న కావేరీ జల వివాదం.. నేడు కర్నాటక బంద్‌కు కన్నడ సంఘాల పిలుపు

Karnataka Bandh Today: కర్నాటక, తమిళనాడు మధ్య కావేరి జలాల వివాదం మరింత ముదురుతోంది. ఈ వివాదం నేపథ్యంలో శుక్రవారం నాడు కర్నాటక బంద్‌కు పిలుపునిచ్చాయి కన్నడ ప్రజా సంఘాలు. తమిళనాడుకు కావేరి జలాల విడుదలపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కర్నాటక సరిహద్దు 5 జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.

Karnataka Bandh: ముదురుతున్న కావేరీ జల వివాదం.. నేడు కర్నాటక బంద్‌కు కన్నడ సంఘాల పిలుపు
Karnataka Bandh

Updated on: Sep 29, 2023 | 9:54 AM

Karnataka Bandh Today: కర్నాటక, తమిళనాడు మధ్య కావేరి జలాల వివాదం మరింత ముదురుతోంది. ఈ వివాదం నేపథ్యంలో శుక్రవారం నాడు కర్నాటక బంద్‌కు పిలుపునిచ్చాయి కన్నడ ప్రజా సంఘాలు. తమిళనాడుకు కావేరి జలాల విడుదలపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కర్నాటక సరిహద్దు 5 జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. కాగా, ఈ బంద్‌కు బీజేపీ, జేడీఎస్, ఆప్ మద్ధతు ప్రకటించాయి. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి చూద్దాం.

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా కావేరి జల వివాదం కొనసాగుతోంది. కావేరి వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కర్నాటక నుంచి 15 రోజులపాటు తమిళనాడుకు 5000 క్యూసెక్ నీటిని విడుదల చేయాలని కోరింది. కావేరీ పరీవాహక ప్రాంతంలో తక్కువ వర్షపాతం నమోదైనందున నీటిని విడుదల చేసే స్థితిలో లేమని కర్నాటక రైతులు చెబుతున్నారు..దీంతో రెండు రాష్ట్రాల మధ్య జల జగడం రాజుకుంది.

తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలన్న ఆదేశాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు కర్నాటక రాష్ట్ర బంద్‌ పాటిస్తున్నాయి. అనేక సంఘాలు కలిసి కన్నడ ఒక్కుట పేరుతో ఏకమై ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. బెంగళూరులో టౌన్‌ హాల్‌ నుంచి ఫ్రీడం పార్క్‌ వరకు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని ప్రకటించాయి. యావత్తు కర్నాటక ప్రయోజనాల కోసం తాము బంద్‌ నిర్వహిస్తున్నామని, అన్ని హైవేలు, టోల్‌ గేట్లు, రైల్వేలు, విమానాశ్రయాలను మూసివేయిస్తామని తెలిపాయి. ఈ బంద్‌కు ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌లతోపాటు హోటళ్లు, ఆటోరిక్షాల సంఘాలు మద్దతు పలికాయి.

అటు సినీ నటుడు సిద్ధార్థ్‌కు కావేరి సెగ తగిలింది. ‘చిక్కు’ సినిమా ప్రమోషన్‌, స్పెషల్‌ స్క్రీనింగ్‌ కోసం ఆయన బెంగళూరు వచ్చారు. అయితే తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను వ్యతిరేకిస్తున్న నిరసనకారులు ఆయన వద్దకు వెళ్లి, ఓ తమిళ నటుడు తన సినిమాను కర్నాటకలో ప్రమోట్‌ చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదని చెప్పారు. కర్నాటక నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నదని, రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చామని, ప్రెస్‌ మీట్‌ నిర్వహించవద్దని చెప్పారు. దీంతో సిద్ధార్థ ప్రెస్‌ మీట్‌ నుంచి వెళ్లిపోయారు.

కర్నాటక బంద్ సందర్భంగా మాండ్యా జిల్లాల్లో 144 సెక్షన్‌ను విధించారు. రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. తమిళనాడుకు కావేరి జలాల విడుదలపై నిరసన తెలుపుతున్నారు. కర్నాటక సరిహద్దు 5 జిల్లాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. అటు కృష్ణగిరి, ధర్మపురి, సేలం, ఈరోడ్‌, నీలగిరిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. తమిళనాడు వైపు వెళ్లే వాహనాలపై ఆంక్షలు పెట్టారు.

కన్నడ రైతుల బంద్ దృష్ట్యా కర్ణాటక పోలీసులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్ సందర్భంగా రోడ్లపై వాహనాలు, అవసరమైతే విమానాలను కూడా అడ్డుకుంటామని రైతు సంఘాలు ప్రకటించాయి. బంద్ నేపథ్యంలో బెంగళూరు నగరంలో అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఆటోరిక్షా డ్రైవర్స్ యూనియన్, ఓలా, ఉబర్ డ్రైవర్లు, కార్ల యజమానుల సంఘం బంద్‌కు మద్దతు ఇచ్చాయి. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లను మూసివేశారు. బ్యాంకులు, అంబులెన్సులు, ఫార్మా వాహనాలు, ఆసుపత్రులు, వైద్య దుకాణాలు వంటి అత్యవసర సేవలు అందుబాటులో ఉంచారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..