కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లు జోరుగా సాగుతున్నాయి. సీఎం బొమ్మై షిగ్గౌన్‌లో నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ 43 మందితో మూడో జాబితాను విడుదల చేసింది. హుబ్లీ నుంచి తనకు టిక్కెట్ ఇవ్వకపోతే 24 గంటల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని మాజీ సీఎం జగదీశ్ శెట్టార్ బీజేపీ హైకమాండ్‌కు డెడ్‌లైన్ విధించారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. షిగ్గౌన్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా నామినేషన్ వేశారు సీఎం బస్వరాజ్ బొమ్మై. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరోసారి కర్నాటక ప్రజలు బీజేపీని ఆశీర్వదిస్తారని అన్నారు. విపక్షాల తప్పుడు ఆరోపణలు కర్నాటక ప్రజలు నమ్మడం లేదన్నారు బస్వరాజ్ బొమ్మై గతంలో కంటే ఎక్కువ సీట్లతో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందన్నారు.
మరోవైపు హుబ్లీలో తన అభ్యర్ధిత్వంపై బీజేపీ అధిష్టానం ఎటూ తేల్చకపోవడంతో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి సిద్దమయ్యారు మాజీ సీఎం జగదీశ్ శెట్టార్. ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలన్న ఆలోచనతో ఆయన ఉన్నారు. హైకమాండ్‌కు ఆదివారం వరకు సమయం ఇస్తునట్టు తెలిపారు శెట్టార్. తనకు టిక్కెట్ ఇవ్వకపోతే బీజేపీకి 25 నియోజకవర్గాల్లో నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు శెట్టార్. ఆయనకు నచ్చచెప్పడానికి కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి ప్రయత్నించారు.
మరోవైపు అన్ని పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. రేపు కోలార్‌లో జరిగే సభకు హాజరవుతారు రాహుల్‌గాంధీ. కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య వరుణ నియోజకర్గం నుంచే పోటీ చేస్తారని పార్టీ హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది. కోలార్ నుంచి కూడా పోటీ చేయాలని సిద్దరామయ్య భావించారు. కాంగ్రెస్ 43 మందితో మూడో జాబితాను విడుదల చేసింది . బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన లక్ష్మణ్ సావడికి అతాని సీటును కేటాయించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..