Farmers Protest: ట్రాక్టర్‌పై పెళ్లి కొడుకు.. వినూత్న రీతిలో రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపిన వరుడు..
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమానికి ప్రజా మద్దతు క్రమక్రమంగా పెరుగుతోంది.
Farmers Protest: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమానికి ప్రజా మద్దతు క్రమక్రమంగా పెరుగుతోంది. తొలుత పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులే ఈ ఉద్యమంలో పాల్గొనగా.. ఆ తరువాత ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రైతులు కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇలా రైతు ఉద్యమం క్రమక్రమంగా దేశ వ్యాపితం అవుతోంది. కాగా, రైతుల ఉద్యమానికి ఓ యువకుడు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన ఓ యువకుడి పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లి వేదిక వద్దకు వరుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ట్రాక్టర్‌పై వచ్చాడు. అలా రైతు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించాడు. ‘ప్రజలంతా రైతు వెంటే ఉన్నారని చెప్పడానికే నేను, నా కుటుంబ సభ్యులు ఇలా ట్రాక్టర్‌పై వచ్చాము’ అని ఆ వరుడు చెప్పుకొచ్చాడు. ‘ప్రజల మద్దతు ఎల్లప్పుడూ రైతులకు ఉంటుంది. దేశానికి రైతులు ఎంతో ముఖ్యం. కానీ ఆ రైతులపైనే ప్రభుత్వం వాటర్ కేనన్లను ప్రయోగిస్తోంది. తీవ్రమైన చలికాలంలో రైతులపై వాటర్ కేనన్లను ప్రయోగించడం ఏంటి?’ అని కేంద్ర ప్రభుత్వంపై సదరు వరుడు ఫైర్ అయ్యాడు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు గత వారం రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనలను విరమించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ చర్చలు విఫలమవడంతో రైతులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. కాగా, రైతు ఉద్యమానికి క్రమక్రమంగా మద్దతు పెరుగుతోంది. తాజాగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రైతులకు సంఘీభావంగా ఆందోళనకు పిలుపునిచ్చారు.