Cyclone Burevi: బురేవి తుఫాన్ బీభత్సం.. నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్.. తమిళనాట 12 మంది మృతి..
బురేవి తుఫాన్ తమిళనాడులో బీభత్సం సృష్టిస్తోంది. తుఫాన్ కారణంగా కడలూరు, అరియలూరు, నాగపట్నం, రామనాధపురం జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది.
Cyclone Burevi: బురేవి తుఫాన్ తమిళనాడులో బీభత్సం సృష్టిస్తోంది. తుఫాన్ కారణంగా కడలూరు, అరియలూరు, నాగపట్నం, రామనాధపురం జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఇప్పటి వరకు అక్కడ 34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. తుఫాన్ ప్రభావంతో తమిళనాడులో 12 మంది చనిపోయారు. చాలా గ్రామాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలతో ప్రముఖ చిదంబరం నటరాజ స్వామి ఆలయం జలదిగ్బంధంలో ఉంది. కాగా, నేడు, రేపు కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావర శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో ఈ నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటన కొనసాగుతోంది. మరోవైపు బురేవి తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పైనా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తుఫాన్ కారణంగా దక్షిణా కోస్తాంధ్రలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అలాగే చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.
ఇదిలాఉండగా, బురేవి తుఫాన్ తమిళనాడులోని రామనాధపురానికి 40 కిలోమీటర్ల దూరంలో దాదాపు 24 గంటలకు పైగా సముద్రంలో స్థిరంగా ఓకే చోట కదలకుండా ఉంది. మరో 12 గంటల పాటు అదే చోట ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే ఈ తుఫాన్ తన దిశ మార్చుకుని పాండిచ్చేరి, చెన్నై వైపుగా పయనించే అవకాశం ఉందన్నారు. ఒకవేళ బురేవి తుఫాన్ దిశ మారినట్లయితే ఆంధ్రప్రదేశ్‌పై ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.