Farmers Protest: కీలక నిర్ణయం ప్రకటన చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి.. కలకత్తాలో మూడు రోజులు పాటు…
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతలు చేపట్టిన ఉద్యమం ఊపందుకుంటోంది. క్రమంగా రాజకీయ పార్టీల మద్దతు కూడా..
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతలు చేపట్టిన ఉద్యమం ఊపందుకుంటోంది. క్రమంగా రాజకీయ పార్టీల మద్దతు కూడా రైతులకు తోడవుతోంది. తాజాగా రైతు ఉద్యమానికి మద్ధతుగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రాజధాని కలకత్తాలో మూడు రోజుల పాటు ఆందోళనలకు పిలుపునిచ్చారు. మమత ప్రకటన ఇప్పుడు రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. డిసెంబర్ 8, 9, 10 తేదీల్లో కలకత్తాలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఈ మేరకు మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. ‘రైతుల జీవితాలు, జీవనోపాది పట్ల తాము తీవ్ర ఆందోళనలో ఉన్నాము. మొదటి నుండి తాము ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ వస్తున్నాము. రైతు వ్యతిరేక బిల్లులను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి. కేంద్రం వెనక్కి తగ్గకపోతే రాష్ట్రం, దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం.’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె హెచ్చరించారు.
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను సీఎం మమతా బెనర్జీ తూర్పారబట్టారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం.. ప్రభుత్వ సంస్థలన్నింటినీ అమ్మకానికి పెట్టిందని విమర్శలు గుప్పించారు. రైల్వేలు, ఎయిర్ ఇండియా, కోల్, బిఎస్ఎన్ఎల్, బిహెచ్ఈఎల్, బ్యాంక్‌లు, రక్షణ రంగం ఇలా అన్నీ ప్రైవేటే పరం చేస్తున్నారని, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాన్ని విడనాడాలని సీఎం మమత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీ అస్తులన్నట్లుగా అన్నింటినీ అమ్మకానికి పెడుతుంటే తాము చూస్తూ ఊరుకోమని మమత స్పష్టం చేశారు.
ఇదిలాఉండగా, డిసెంబర్ 8వ తేదీన రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. వ్యవసాయ చట్టాలకు సంబంధించి కేంద్రం తమ ముందు ఉంచిన ప్రతిపాదనలు ఏవి కూడా ఆమోదయోగ్యంగా లేవని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.
Also Read:
Burevi Byclone: బురేవి తుఫాన్ బీభత్సం.. నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్.. తమిళనాట 12 మంది మృతి..