చండీగఢ్ విమానాశ్రయంలో తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ అధికారులకు ఫిర్యాదు చేశారు. చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నప్పుడు తనపై దాడి జరిగినట్లు కంగనా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లేందుకు చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్నానని.. ఈ సమయంలో సెక్యూరిటీ చెక్-ఇన్ తర్వాత బోర్డింగ్ కోసం వెళుతున్నప్పుడు LCT కుల్విందర్ కౌర్ (CISF యూనిట్ చండీగఢ్ ఎయిర్‌పోర్ట్) చెంపదెబ్బ కొట్టినట్లు కంగనా రనౌత్ ఆరోపించారు. రైతుల ఉద్యమాన్ని అవమానించారని దూషిస్తూ తనపై దాడి చేశారని కంగనా రనౌత్ తెలిపారు.
అయితే.. కంగనా రనౌత్‌పై దాడి చేసిన మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. కంగన రనౌత్ పై చేయి చేసుకున్న సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.
కాగా.. చండీగఢ్ ఎయిర్‌పోర్టులో జరిగిన ఘటన అనంతరం ఢిల్లీకి చేరుకున్న కంగనా రనౌత్.. సీనియర్ అధికారుల సమక్షంలో, ఆమె ఈ సంఘటన గురించి CISF డైరెక్టర్ జనరల్ నీనా సింగ్‌కు ఫిర్యాదుచేశారు. చండీగఢ్ విమానాశ్రయంలోని కర్టెన్ ఏరియాలో కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ తనతో వాదించి చెంపదెబ్బ కొట్టారని కంగనా వివరించారు.
కానిస్టేబుల్ కుల్విందర్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. సీఓ గదిలో నిర్బంధించి విచారణ కొనసాగిస్తున్నారు. చండీగఢ్ విమానాశ్రయంలో సీసీటీవీ ఫుటేజీలను సైతం తనిఖీ చేస్తున్నారు.
కాగా.. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచి భారీ మెజార్టీతో గెలుపొందారు.. మండిలో కంగనా రనౌత్ కు 5,37,022 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ కు 4,62,267 ఓట్లు వచ్చాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..