కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో మరో విధ్వంసకర ఘటన చోటు చేసుకుంది. కాళీ నది మీద ఉన్న ఓ వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది. కార్వార్ మీదుగా వెళ్లే 66వ జాతీయ రహదారిపై కాళీ నదిపై నిర్మించిన వంతెన ఉన్నట్టుండి కూలిపోయింది. మంగళవారం అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో ఓ ట్రక్కు వెళ్తుండగా బ్రిడ్జి అమాంతంగా కూలింది. ఫిల్లర్ పిల్లర్ల మధ్య వంతెన నాలుగు వైపుల నుంచి విరిగి నదిలో పడిపోయింది. దీనితో ట్రక్కు నదిలో పడిపోగా, డ్రైవర్‌ను మత్స్యకారులు రక్షించారు. అనంతరం ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.
అయితే ఈ ప్రమాదం రాత్రివేళ కాకుండా తెల్లవారు జామున జరిగి ఉంటే భారీ నష్టం వాటిల్లి ఉండేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతెన పాతది కావడం వల్లే అది కూలిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. గోవా, కర్ణాటక మధ్య ఈ బ్రిడ్జ్ కీలక వారధిగా ఇన్నాళ్లు కొనసాగుతూ ఉంది.
ఇప్పుడు ఈ వంతెన ధ్వంసం కావడం వల్ల గోవా, కర్ణాటక జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో అదే నదిపై ఉన్న కొత్త వంతెనను ప్రారంభించి, ఆంక్షలతో వాహనాలను అనుమతించారు. గత కొన్ని రోజులుగా ఉత్తర కన్నడ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..