
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులు పెను మారణకాండకు దారితీశాయి. కాబూల్‌లోని ఒమిద్ అడిక్షన్ ట్రీట్‌మెంట్ హాస్పిటల్ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో సుమారు 400 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ అమానుష ఘటనపై భారతదేశం తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇస్లామాబాద్ చర్యలను తప్పుబడుతూ విడుదల చేసిన ప్రకటనలో ఇది అత్యంత అమానుషమైన, పిరికిపంద చర్య అని అభివర్ణించింది. వైద్య సేవలు అందించే ఆసుపత్రిని సైనిక లక్ష్యంగా ఎంచుకోవడం ఏమాత్రం సమర్థించలేని విషయం. అమాయక పౌరులను బలితీసుకోవడం పాకిస్థాన్ క్రూరత్వానికి నిదర్శనం” అని భారత్ తెలిపింది. ఒక మారణకాండను సైనిక చర్యగా చిత్రీకరించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని, కానీ ఇది ముమ్మాటికీ హేయమైన దురాక్రమణ అని భారత్ స్పష్టం చేసింది.
ఈ దాడి ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాధికారాన్ని కాలరాయడమేనని, ప్రాంతీయ శాంతి మరియు స్థిరత్వానికి పాక్ చర్యలు ప్రత్యక్ష ముప్పుగా మారాయని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధ క్షేత్రంతో సంబంధం లేని రోగులు, వైద్య సిబ్బందిపై బాంబుల వర్షం కురిపించడం అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడమేనని విదేశాంగ శాఖ పేర్కొంది. కాగా మత్తుమందు బానిసలకు చికిత్స అందించే ఈ ఆసుపత్రిపై జరిగిన దాడితో కాబూల్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆసుపత్రి భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద చిక్కుకుని వందలాది మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక వర్గాలు చెబుతున్నాయి.
కాగా ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్న ఈ తీవ్రమైన ఆరోపణలను పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం తోసిపుచ్చడం గమనార్హం. తాము కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని, పౌర స్థావరాలపై లేదా ఆసుపత్రులపై ఎటువంటి దాడులు చేయలేదని పాక్ బుకాయిస్తుంది. కాబూల్, తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో చేపట్టిన ఆపరేషన్‌లో పౌరులకు ఎటువంటి నష్టం జరగలేదని చెబుతుంది.