RRB NTPC UG 2026 Exam Dates: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ రాత పరీక్ష తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్ ఇదే
RRB NTPC Exam Dates 2026: రైల్వేల్లో ఖాళీగా ఉన్న నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్) పోస్టుల భర్తీకి సంబంధించిన కీలక అప్‌డేట్ జారీ చేసింది. మొత్తం 3,058 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ రైల్వే ఉద్యోగాలకు ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగియగా.. లక్షలాది మంది అభ్యర్ధులు రాత పరీక్ష తేదీల కోసం ఎదురు

హైదరాబాద్, ఏప్రిల్ 14: దేశవ్యాప్తంగా రైల్వేల్లో ఖాళీగా ఉన్న నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్) పోస్టుల భర్తీకి సంబంధించిన కీలక అప్‌డేట్ జారీ చేసింది. మొత్తం 3,058 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ రైల్వే ఉద్యోగాలకు ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగియగా.. లక్షలాది మంది అభ్యర్ధులు రాత పరీక్ష తేదీల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ రైల్వే సీబీటీ 1 పరీక్షల తేదీలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) మంగళవారం (ఏప్రిల్ 14) విడుదల చేసింది. తాజా ప్రకటన మేరకు సీబీటీ 1 పరీక్షలు రెండు విడతల్లో జరగనున్నాయి. మే 7, 8, 9 తేదీల్లో , అలాగే జూన్ 13, 14, జూన్ 16 నుంచి 21వ తేదీ వరకు రైల్వే సీబీటీ 1 పరీక్షలు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షా కేంద్రం ఉన్న నగరం వివరాలను పరీక్ష తేదీకి 10 రోజుల ముందే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఇక అడ్మిట్ కార్డులు పరీక్షా తేదీకి 4 రోజుల ముందు మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలవుతుంది. అభ్యర్థులు తమ పేరు, 10వ తరగతి సర్టిఫికేట్ ప్రకారం పుట్టిన తేదీ, ఫోటో, చిరునామా,తండ్రి పేరుతో సహా తమ ఆధార్ వివరాలు సరిగ్గా, అప్‌డేట్‌గా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష రోజున UIDAI సిస్టమ్‌లో తమ ఆధార్ అన్‌లాక్‌గా ఉండేలా అభ్యర్థులు నిర్ధారించుకోవాలి. దరఖాస్తు ప్రక్రియలో ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా తమతోపాటు ఒరిజినల్ ఆధార్ కార్డును పరీక్ష కేంద్రానికి తీసుకురావల్సి ఉంటుంది. ఇతర అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు కేవలం అధికారిక వెబ్‌సైట్‌లనే విశ్వసించాలని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు సూచించాయి. అలాగే డబ్బుకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మోసపూరిత ఏజెంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాయి. నియామక ప్రక్రియ పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారానే జరుగుతుందని, ప్రత్యామ్నాయ ఎంపిక పద్ధతులు ఏవీ లేవని అధికారులు స్పష్టం చేశారు.
రాత పరీక్ష విధానం ఇలా..
ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సీబీటీ 1 రాత పరీక్ష అనేది కేవలం స్క్రీనింగ్ పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కులను నార్మలైజ్డ్ స్కోరు ఆధారంగా అభ్యర్థులను మెరిట్ ప్రకారంగా రెండో దశ (సీబీటీ 2)కు ఎంపిక చేస్తారు. సీబీటీ 1లో మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. 90 నిమిషాల వ్యవధి ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 40 ప్రశ్నలు, మ్యాథ్స్ విభాగం నుంచి 30 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగం నుంచి 30 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




