Judge Pushpa Virendra Ganediwala: బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ జడ్జి జస్టిస్ పుష్ప గనేదివాలా.. బాలికలపై లైంగిక దాడి కేసుల్లో వివాదాస్పదమైన తీర్పులిచ్చి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ తీర్పులు ఇప్పుడు గనేదివాలా పదోన్నతికి అడ్డుగా మారాయి. జస్టిస్ పుష్ప పదవీ కాలాన్ని అదే స్థాయిలో మరో ఏడాది పాటు కొనసాగిస్తూ కేంద్ర న్యాయశాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. సాధారణంగా అదనపు న్యాయమూర్తి పదవీకాలం రెండేళ్లే ఉంటుంది. ఆ తర్వాత శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తారు. అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ పుష్ప తన రెండేళ్ల పదవీకాలాన్ని ఈ శుక్రవారంతో పూర్తి చేసుకున్నారు. కానీ ఆమెను అదే స్థానంలో ఉంచుతూ.. మరో ఏడాది పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
వాస్తవానికి జస్టిస్ పుష్పను బాంబే హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా సుప్రీం కొలీజియం గతంలో సిఫారసు చేసింది. ఈ క్రమంలో గతనెలలో లైంగిక వేధింపుల కేసుల్లో పుష్ప వెలువరించిన రెండు తీర్పులు తీవ్రంగా వివాదాస్పదమయ్యాయి. దీంతో సుప్రీం కొలీజియం సిఫారసును వెనక్కి తీసుకుని.. ఆమెను మరో రెండేళ్లపాటు అదనపు న్యాయమూర్తిగానే కొనసాగించాలని పేర్కొంది. అయితే సుప్రీం సిఫారసులను పరిగణలోకి తీసుకున్న కేంద్రం ప్రభుత్వం.. ఆమె పదవీకాలాన్ని ఏడాది పాటే పొడిగిస్తూ.. నిర్ణయం తీసుకుంది.
Also Read: