JP Nadda: నడ్డా పదవీకాలం పొడిగింపు వెనుక తిరుగులేని వ్యూహం.. బీజేపీ అధినాయకత్వ నిర్ణయానికి కారణాలివే

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర బీజేపీలో వర్గ విభేదాలకు, గ్రూపు తగాదాలకు ఆయనే కారణమని.. తక్షణం ఆయన్ని మార్చాలని ఆర్ఎస్ఎస్ కూడా సూచించినట్లు కథనాలు వచ్చాయి.

JP Nadda: నడ్డా పదవీకాలం పొడిగింపు వెనుక తిరుగులేని వ్యూహం.. బీజేపీ అధినాయకత్వ నిర్ణయానికి కారణాలివే
Amit Shah - JP Nadda - Narendra Modi
Follow us

|

Updated on: Jan 18, 2023 | 4:10 PM

మొన్నా మధ్య జరిగిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆయనను మార్చడం తథ్యమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ఆయనపై గుర్రుగా ఉన్నారని ప్రచారం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర బీజేపీలో వర్గ విభేదాలకు, గ్రూపు తగాదాలకు ఆయనే కారణమని.. తక్షణం ఆయన్ని మార్చాలని ఆర్ఎస్ఎస్ కూడా సూచించినట్లు కథనాలు వచ్చాయి. కానీ, ఇవేవీ నిజం కాదని జనవరి 17వ తేదీన తేలిపోయింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల దాకా ఆయనే పార్టీకి సారథ్యం వహిస్తారని ఏకంగా అమిత్ షా ప్రకటించేశారు. ఎస్.. ఈ కథనం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగనున్న జగత్ ప్రకాష్ నడ్డా గురించే. బిజెపి జాతీయ కార్యవర్గం జేపీ నడ్డా అధ్యక్ష పదవి కాలాన్ని జూన్ 2024 దాకా పొడిగించింది. అంటే జేపీ నడ్డా సారధ్యంలోనే వచ్చే పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కోవాలని బిజెపి అత్యున్నత కార్యకారిణి సమితి తీర్మానించింది. ఈ నిర్ణయం వెనుక బిజెపి అధినాయకత్వం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు అర్థమవుతుంది. 2023 సంవత్సరంలో దేశంలోని తొమ్మిది రాష్ట్రాలకు కచ్చితంగా ఎన్నికలు జరుగుతాయి. అదే సందర్భంలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇదే సంవత్సరం జరిగే అవకాశం కనిపిస్తుంది. కొన్ని ఊహాగానాలు నిజమైతే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఈ సంవత్సరమే ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం వుంది. ఇదే జరిగితే 2023 సంవత్సరంలో మొత్తం 11 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగవచ్చు. ఇంత బిజీ ఇయర్ కాబట్టే జాతీయ అధ్యక్షుని మార్పు అంశాన్ని బిజెపి అధినాయకత్వం పక్కన పెట్టిందని భావించాలి. మరో నెల, నెలా 15 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే నెలలో బిజెపి అత్యంత కీలకంగా భావిస్తున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ సంవత్సరం ద్వితీయార్థంలో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ లాంటి కీలక రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. బిజెపి కీలక సమావేశంలో జనవరి 16వ తేదీన ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సంవత్సరం ఎన్నికలు జరగనున్న తొమ్మిది రాష్ట్రాలలో పాగా వేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందులో తెలంగాణ కూడా ఉంది. ఈ తొమ్మిది రాష్ట్రాలతో పాటు ఎన్నికలు జరిగితే కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోనూ తమ బలాన్ని పెంచుకోవాలని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. 9 లేదా 11 రాష్ట్రాలకు ఈ సంవత్సరం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుని ఎన్నిక పేరిట పార్టీ కీలక నాయకత్వం డైవర్ట్ కాకూడదు అన్న ఉద్దేశంతోనే జగత్ ప్రకాష్ నడ్డాకు ఎక్స్టెన్షన్ లభించినట్లు భావించాలి. 2024 వేసవి కాలంలో పార్లమెంటు ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగుతాయి. 2023 సెమీఫైనల్ ఎన్నికలకు, 2024 ఫైనల్ ఎన్నికలకు పెద్దగా విరామం లేదు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుని ఎన్నుకున్నా కూడా అతనికి పార్టీ మీద పట్టు, యంత్రాంగం మీద అవగాహన, ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు తగిన సమయం వుండవు. ఇలాంటి కీలక అంశాలను దృష్టిలో పెట్టుకొని జెపి నడ్డా పదవీ కాలాన్ని పొడిగించినట్లుగా అవగతం అవుతోంది.

వరుస ఎన్నికలే కారణం

నిజానికి జనవరి 20తో నడ్డా పదవీకాలం ముగిసేది. కీలకమైన అంశాలను పరిగణలోకి తీసుకున్న బిజెపి జాతీయ కార్యవర్గం ఆయన పదవీ కాలాన్ని జూన్ 2024 దాకా పొడిగించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన వ్యతిరేక వర్గాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేశారన్న అభియోగాలను జెపీ నడ్డా ఎదుర్కొన్నారు. మోదీ, అమిత్ షాలిద్దరు నడ్డాపై కోపంగా వున్నారని జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. దాంతో నడ్డాకు పొడిగింపు లభించదని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా, ఇంకా చెప్పాలంటే వ్యూహాత్మకంగా నడ్డా పదవీ కాలాన్ని ఏడాదిన్నర కాలానికి పెంచారు. ఆయన పదవీ కాలాన్ని పొడిగించే తీర్మానాన్ని రక్షణ శాఖ మంత్రి, బిజెపి మాజీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ప్రవేశపెట్టగా జాతీయ కార్యవర్గం ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించింది. నడ్డా పదవీ కాలాన్ని పొడిగించినట్లు వెల్లడించిన అమిత్ షా అత్యంత కీలకమైన సమయంలో పార్టీ జాతీయ అధ్యక్షులుగా వ్యవహరించిన నడ్డా పనితీరును పొగిడారు. 2020 జనవరి నెలలో నడ్డా పార్టీ జాతీయ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రెండు మాసాలకే యావత్ ప్రపంచం కరోనా వైరస్ బారిన పడింది. ఆ తర్వాత దాదాపు ఏడాదిన్నర కాలం కరోనా వైరస్ విడతల వారీగా మానవాళి పై దాడి చేసిన సందర్భంలో పార్టీ యంత్రాంగాన్ని ప్రజాసేవలో మమేకం చేయగలిగారంటూ నడ్డాపై అమిత్ షా ప్రశంసల జల్లు కురిపించారు. ఇక్కడ ఒక కీలకమైన అంశం ప్రస్తావన అర్హంగా కనిపిస్తోంది. నడ్డా ఎన్నికైన తర్వాత బిజెపి అధ్యక్ష ఎన్నికల ప్రహసనంలో ఒక కీలకమైన అంశం మిస్సయింది. దానికి కరోనా వైరస్ కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులేనని బిజెపి జాతీయ కార్యవర్గం అభిప్రాయపడింది. కరోనా వైరస్ విడతల వారీగా దాడి చేయడంతో బిజెపి బూత్ లెవెల్ కమిటీల ఎన్నికలు పూర్తి కాలేదు. మిగిలిన పార్టీలకు భిన్నంగా బిజెపిలో ఒక విధానం అమల్లో ఉంటుంది. పార్టీ అంతర్గత ఎన్నికల ప్రహసనంలో ముందుగా జరగాల్సింది బూతు స్థాయి కమిటీల ఎన్నిక.. ఆ తర్వాత గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి పార్టీ వ్యవస్థాపక ఎన్నికలు పూర్తిచేసుకుని.. ఆ తర్వాత జాతీయ అధ్యక్షుని ఎన్నికలకు వెళుతుంది బిజెపి. కానీ, కరోనా వైరస్ కారణంగా బూతు స్థాయి కమిటీల ఎన్నికలు పూర్తి కాలేదు. నడ్డా పదవీ కాలాన్ని పొడిగించడానికి ఇది కూడా ఒక కారణమని బిజెపి శ్రేణులు చెబుతున్నాయి. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా పూర్తి కాలేదు. సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి కాకపోవడంతో బూతు స్థాయి కమిటీల ఎన్నికలు జరగలేదు. దాని ప్రభావం అన్ని స్థాయిల సంస్థాగత ఎన్నికలపై పడింది. దానికి తోడు 2023, 2024లో దాదాపు సగం దేశం వివిధ రకాల ఎన్నికలకు వెళ్లాల్సి ఉండడంతో బిజెపి జాతీయ కార్యవర్గం జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగించేందుకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

పూర్తికాని సభ్యత్వమూ ఓ కారణమే

జేపీ నడ్డా పదవీకాలంలో పలు రాష్ట్రాలలో తమ పార్టీ బలపడిందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బీహార్‌లో బిజెపి బాగా పుంజుకుందని అంటున్నారు. హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేశామని వారు చెబుతున్నారు. మహారాష్ట్రలో కీలకమైన మంత్రాంగం జరిపి అధికారంలోకి వచ్చామని, ఆ క్రెడిట్ కూడా జేపీ నడ్డాకే దక్కుతుందని బిజెపి కార్యకారిణి సమితి అభిప్రాయపడింది. తెలంగాణతోపాటు తమిళనాడులో కూడా బిజెపి బలపడుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించడం విశేషం. మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో బిజెపి శ్రేణులకు నడ్డా దిశ నిర్దేశం చేశారని బిజెపి జాతీయ కార్యవర్గం పేర్కొంది. మరో 400 రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే వరుసగా రెండోసారి బిజెపి తిరుగులేని మెజారిటీతో కేంద్రంలో అధికారంలో కొనసాగుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించాలని బిజెపి అధినాయకత్వం వ్యూహరచన చేస్తోంది. ఆ దిశగా అనుసరించాల్సిన మార్గాన్ని, వేయాల్సిన ఎత్తుగడలను, అమలు చేయాల్సిన వ్యూహాలను బిజెపి అధినాయకత్వం సూత్రప్రాయంగా ఖరారు చేసింది. వీటికి మరింత పదును పెట్టడం ద్వారా ఆచరణలోకి తీసుకొచ్చే బాధ్యతలను జేపీ నడ్డాపై బీజేపీ జాతీయ కార్యవర్గం మోపింది. 2024 జనవరి ఒకటవ తేదీన అయోధ్యలో భవ్య రామ మందిర ప్రారంభోత్సవం నిర్వహించడం ద్వారా వచ్చే ఎన్నికలపై దాని ప్రభావం పడేలా చూడాలని బిజెపి అధినాయకత్వం భావిస్తోంది. దేశ ఆర్థిక పరిస్థితిని పురోగమనం దిశగా మళ్ళించడం, కరోనా గడ్డు కాలంలో ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుండా చూసుకోవడం, ప్రజారోగ్య పరిరక్షణ కోసం 200 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయడం, అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేయడం, ప్రపంచ పటంలో భారతదేశాన్ని తిరుగులేని శక్తిగా పలు దేశాలు గుర్తించేలా చేయడం వంటి అంశాలలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను 2024 పార్లమెంటు ఎన్నికల కంటే ముందు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసుకోవాలని బిజెపి జాతీయ కార్యవర్గం తీర్మానించింది. దానికి అనుగుణంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే బాధ్యతలను నడ్డాపై మోపింది. మొత్తం మీద నడ్డా పదవీకాలం పొడిగించడం వెనుక బిజెపి అధినాయకత్వం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే చెప్పాలి.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!