కేరళలో కొత్త మంత్రివర్గంలో జర్నలిస్ట్ వీణా జార్జ్‌కు చోటు దక్కింది. కొలువుదీరే కొత్త మంత్రివర్గంలో కొత్తవారికి అవకాశం లభించింది. శైలజ స్థానంలో మరో మహిళనే సీఎం పినరయి విజయన్ భర్తీ చేశారు. ఎమ్మెల్యే వీణ జార్జ్ ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.పట్టణమిట్ట జిల్లాలోని ఆరన్‌మూల నియోజకవర్గం నుంచి వీణ జార్జ్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2016లోనూ అదే స్థానం నుంచి ఆమె విజయం సాధించారు. రాజకీయాల్లోకి రాకముందు వీణ జర్నలిస్టుగా పని చేశారు.
అందరిలో ఇప్పుడు ఇదే ప్రశ్న వినిపిస్తోంది. అయితే 1976 ఆగస్ట్ 3న తిరువనంతపురంలో జన్మించిన వీణా జార్జ్ ఎమ్మెస్సీ ఫిజిక్స్‌లో స్టేట్ ర్యాంకర్ నిలిచారు. బి.ఇడి కూడా పూర్తి చేశారు.
ఆ తర్వాత టీవీ జర్నలిజంలోకి ప్రవేశించారు. కైరళి, మనోరమ, టీవీ న్యూస్ వంటి ప్రైమ్ ఛానళ్లలో నూస్ యాంకర్‌గా, న్యూస్ ఎడిటర్‌గా, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా పని చేశారు.
కేరళ జర్నలిజంలో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ హోదా పొందిన తొలి మహిళా జర్నలిస్టు కూడా వీణ కావడం విశేషం. అయితే విద్యార్థి దశలోనే రాజకీయలపై మక్కువ ఉండటంతో Communist Party of India (Marxist) విద్యార్థి విభాగం అయిన ఎస్.ఎఫ్.ఐలో వివిధ స్థాయిల్లో పని చేశారు.
ఇదిలావుంటే కేరళలో కరోనా కట్టడికి అవిశ్రాంతంగా పని చేసిన ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజకు కొత్త కేబినెట్‌లో చోటు లభించలేదు. శైలజకు చోటుదక్కక పోవడంతో అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇక సీఎం విజయన్ వద్ద హోం, ఐటీతో పాటు మైనార్టీ సంక్షేమ శాఖలను ఉంచుకోనున్నారు.