Jharkhand Political Crisis: జార్ఖండ్‌‌లో క్యాంప్ రాజకీయాలు షురూ..! ఎమ్మెల్యేలతో సీఎం హేమంత్ ట్రిప్.. చివరకు..

సొంత పార్టీ జార్ఖండ్‌ ముక్తి మోర్చా ఎమ్మెల్యేలతో పాటు తనకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కల్సి ప్రత్యేక బస్సుల్లో రాంచీ నుంచి బయలుదేరారు. ఎక్కడికి వెళుతున్నారనేది సీక్రెట్‌గా ఉంచారు.

Jharkhand Political Crisis: జార్ఖండ్‌‌లో క్యాంప్ రాజకీయాలు షురూ..! ఎమ్మెల్యేలతో సీఎం హేమంత్ ట్రిప్.. చివరకు..
Hemant Soren

Updated on: Aug 28, 2022 | 7:58 AM

Jharkhand Political Crisis: జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రాష్ట్రం విడిచివెళ్లారు. సొంత పార్టీ జార్ఖండ్‌ ముక్తి మోర్చా ఎమ్మెల్యేలతో పాటు తనకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కల్సి ప్రత్యేక బస్సుల్లో రాంచీ నుంచి బయలుదేరారు. ఎక్కడికి వెళుతున్నారనేది సీక్రెట్‌గా ఉంచారు. ఏసీ లగ్జరీ ఏసీ బస్సులు చాలా ముందుగానే సోరెన్‌ నివాసానికి చేరుకున్నాయి. ఎమ్మెల్యేలు తమ లగేజ్‌తో వచ్చాక బస్సులు బయలుదేరాయి. ముందుగా వారు జార్ఖండ్‌లోనే ఖుంటీ జిల్లాలో ఉన్నా లాత్‌రాతూ డ్యామ్‌కు చేరుకున్నారు. అక్కడ ఎమ్మెల్యేలతో కల్సి బోటు షికార్‌ చేశారు సోరెన్‌. తొలి మజిలీలో సరదాగా గడిపిన తర్వాత మళ్లీ ప్రయాణం మొదైలంది. ఫ్రెండ్లీ రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్‌ కానీ పశ్చిమ బెంగాల్‌ కానీ ఎమ్మెల్యేలను తీసుకెళ్లి, అక్కడ క్యాంప్‌లో ఉంచాలని సోరెన్‌ భావిస్తున్నట్టు జేఎంఎం వర్గాలు చెబుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌లోని మేఫేర్‌ రిసార్ట్‌లో ఎమ్మెల్యేలు బస చేయడానికి ఏర్పాట్లు చేశారని వార్తలొచ్చాయి. అయితే.. రాత్రి లోగా సీఎం హేమంత్ సోరెన్ మరో ట్విస్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలతో కలిసి మళ్లీ బస్సుల్లో రాంచీకి చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. గవర్నర్ సోరేన్ పై అనర్హత వేటు వేయనున్నారన్న వార్తల మధ్య హేమంత్ టూర్ పోలిటకల్ హీటెక్కించింది. అయితే.. కోల్‌కతాలో అరెస్టై బెయిల్‌పై ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలను మినహాయించి.. ఈ కుంతీ టూర్‌కు 43 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మరో ముగ్గురు పలు సమస్యలతో రాలేదని నేతలు పేర్కొన్నారు.

తనకు పదవీ గండం పొంచి ఉండడంతో ముందే జాగ్రత్తపడ్డారు సోరెన్‌. అక్రమ మైనింగ్‌ లీజు వ్యవహారంలో ఎమ్మెల్యేగా ఆయనపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర గవర్నర్‌కు సిఫారసు చేసింది. రాబోయే రాజకీయ సంక్షోభాన్ని ఊహించిన సోరెన్‌.. బీజేపీ నుంచి తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేసిందని సోరెన్‌ పేర్కొంటున్నారు. తనపై ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలతో బీజేపీ కుట్ర చేసిందని ఆరోపిస్తున్నారు. జార్ఖండ్ అసెంబ్లీలో 81 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సోరెన్ సంకీర్ణ ప్రభుత్వానికి 49 మంది సంఖ్యాబలం ఉంది. వీరిలో జేఎంఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు 30 మంది. కాంగ్రెస్‌కు 18 మంది, ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ప్రతిపక్ష బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సోరెన్‌పై అనర్హత వేటు పడితే బీజేపీ అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యంతర ఎన్నికలు పెట్టాలనే డిమాండ్ కూడా బీజేపీ నుంచి వినిపిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..